‘రక్షణకు’ తొలి అడుగు
ఎస్‌ఆర్ పురం మండలంలో డీఆర్‌డీవోకు 1102.30 ఎకరాల భూమి కేటాయింపు
ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
డీఆర్‌డీవో ఏర్పాటు అనంతపురం జిల్లా హిందూపురంలో.. కాదు చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్ పురంలో.. కానేకాదు పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో..! ముఖ్యమంత్రి మారిన ప్రతిసారీ ఈ కేంద్రం ఏర్పాటు చేసే స్థలమూ మారుతూ వస్తోంది. రక్షణ రంగంలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ కేంద్రం ఏర్పాటు కోసం జిల్లావాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఎస్‌ఆర్‌పురంలో డీఆర్‌డీవో ఏర్పాటు చేసేందుకు తొలుత 1102.30 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు తొలి అడుగు పడింది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లాలో డీఆర్‌డీవో(రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) ఏర్పాటులో తొలి అడుగు పడింది. ఎస్‌ఆర్‌పురం మండలం కొక్కిరాలకొండలో సర్వే నంబర్ 285/1లో 502.30 ఎకరాలు, చిన్నతయ్యూర్‌లో సర్వే నంబర్ 285/2లో ఆరు వందల ఎకరాలు మొత్తం 1102.30 ఎకరాలను డీఆర్‌డీవోకు కేటాయిస్తూ బుధవారం రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ.శర్మ ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నం:289) జారీచేశారు. నవంబర్ 11, 2010లో అప్పటి కలెక్టర్ శేషాద్రి పంపిన ప్రతిపాదన మేరకు ఎకరాకు రూ.1.25 లక్షల చొప్పున ప్రభుత్వానికి చెల్లించేలా డీఆర్‌డీవోకు భూమిని కేటాయించారు.
వివరాల్లోకి వెళితే.. దేశ రక్షణవ్యవస్థను శత్రుదుర్భేద్యంగా తీర్చిదిద్దడంలో డీఆర్‌డీవోది కీలక భూమిక. ఆకాశ్, త్రిశూల్, అగ్ని వంటి క్షిపణులతోపాటూ బ్రహ్మాస్ వంటి ఖండాంతర క్షిపణిని డీఆర్‌డీవో రూపొందించింది. రక్షణ రంగంలో పరిశోధనలు చేయడంతో పాటూ.. క్షిపణులను తయారుచేసి, సైన్యానికి అందించడంలో డీఆర్‌డీవో ప్రధానపాత్ర పోషిస్తోంది. సమైక్యాంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో డీఆర్‌డీవో కేంద్రం ఏర్పాటుచేశారు. ఆ కేంద్రానికి అనుబంధంగా విశాఖపట్నంలో మరో కేంద్రాన్ని నెలకొల్పారు. డీఆర్‌డీవోను మరింతగా విస్తరించి.. సైన్యానికి అవసరమైన ఆయుధాలను దేశీయంగా ఉత్పత్తిచేసేందుకు ఆ సంస్థ డెరైక్టర్ వీకే.సారస్వత్ రాష్ట్రంలో మరో కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి 2008లో ప్రభుత్వంతో కనీస అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నారు. అప్పటి సీఎం దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ఆ సంస్థను అనంతపురం జిల్లా హిందూపురంలో ఏర్పాటుచేసేలా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. రక్షణశాఖ ప్రతిపాదన మేరకు డీఆర్‌డీవో రూపొందించిన క్షిపణులను ప్రయోగించేందుకు అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం-కనగానిపల్లె మండలాల్లో ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు 17,285 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. కానీ.. వైఎస్ హఠన్మరణం తర్వాత డీఆర్‌డీవో కేంద్రం ఏర్పాటుకు బ్రేక్ పడింది.
ఆ తర్వాత డీఆర్‌డీవో కేంద్రాన్ని ఎస్‌ఆర్‌పురం మండలంలో ఏర్పాటుచేయాలని రోశయ్య ప్రభుత్వం నిర్ణయించింది. రోశయ్య ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్‌ఆర్‌పురం మండలం కొక్కిరాలకొండ, చిన్నతయ్యూరు గ్రామాల పరిధిలోని 1102.30 ఎకరాల భూమిని అప్పటి కలెక్టర్ శేషాద్రి గుర్తించారు. ఆ మేరకు అప్పట్లో ప్రతిపాదనలు పంపారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక డీఆర్‌డీవో కేంద్రాన్ని తన నియోజకవర్గంలో ఏర్పాటుచేసేలా అప్పటి రక్షణశాఖ సహాయమంత్రి ఎం.పల్లంరాజుపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన కేంద్రం పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో ఏర్పాటుచేసేందుకు అంగీకరించింది. కలికిరి మండలం టేకలకోన వద్ద డీఆర్‌డీవో కేంద్రం ఏర్పాటుకు 2600 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో అప్పటి కలెక్టర్ సాలమన్ ఆరోగ్యరాజ్ వెయ్యి ఎకరాల భూమి సేకరించారు.
కానీ.. ఇప్పుడు కథ మళ్లీ మొదటికొచ్చింది. ఎస్‌ఆర్‌పురంలోనే డీఆర్‌డీవో కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ఈనెల 1న మంత్రివర్గం తీర్మానించింది. ఆ మేరకు డీఆర్‌డీవోకు కొక్కిరాలకొండ, చిన్నతయ్యూర్‌లలో 1102.30 ఎకరాలను కేటాయిస్తూ రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ.శర్మ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కనీసం ఇప్పుడైనా డీఆర్‌డీవో కేంద్రం ఏర్పాటుచేస్తే.. జిల్లా పారిశ్రామికాభివృద్ధికి నాంది పలికినట్లవుతుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.