
టీటీడీ వైఖరిపై నిరసన వెల్లువ
టీటీడీ వైఖరి తీరుకు నిరసనగా నిరసన వెల్లువెత్తుతోంది. గండి పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు, భక్తుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ ఎన్‌జీవో సెల్ రాష్ట్ర కార్యదర్శి అంజన్‌కుమార్ యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా.. వారికి వైఎస్సార్ సీపీ నేతలు సంఘీభావం తెలిపారు.
చక్రాయపేట: టీటీడీ వైఖరి తీరుకు నిరసనగా నిరసన వెల్లువెత్తుతోంది. గండి పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు, భక్తుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ ఎన్‌జీవో సెల్ రాష్ట్ర కార్యదర్శి అంజన్‌కుమార్ యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా.. వారికి వైఎస్సార్ సీపీ నేతలు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా అంజన్‌కుమార్ ,బీజేపీజిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏడేళ్లుగా గండిలో పనిచేస్తున్న ఉద్యోగులకు చాలీచాలని జీతాలిస్తూ వారిని, వారి కుటుంబ సభ్యులను ఆకలి మంటలకు గురి చేస్తున్న టీటీడీ అధికారులకు అసలు మానవత్వం అనేదే లేదని ధ్వజమెత్తారు.
న్యాయం చేయాలని రెండుమార్లు పరకామని (హుండీ లెక్కింపు) అడ్డుకున్నారని కక్ష గట్టి వారిలో ఆరుమంది ఉద్యోగులను బదిలీ చేయడం ఏమిటని వారు ఏఈఓను నిలదీశారు. దీక్షలో పాల్గొన్న గండి ఉద్యోగులు మాట్లాడుతూ తమ సమస్య తీర్చమని వేడుకున్నందుకు టీటీడీ వారు ఇచ్చిన బహుమానం ఈ బదిలీ ఉత్తర్వులని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన అన్ని రకాల అలవెన్సులు ఇస్తే వారు ఎక్కడికి బదిలీ చేసినా అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ప్రేమ,దయ లేవు..
టీటీడీ అధికారులకు కింది స్థాయి ఉద్యోగుల పట్ల జాలి,ప్రేమ,దయ అనేవి ఏమాత్రం లేవని వైఎస్సార్ సీపీ నేతలు సుధాకరరెడ్డి, బాబు, ప్రతాప్,మండల కో-ఆప్షన్ సభ్యుడు మహబుబ్‌వల్లి తెలిపారు. గండి ఉద్యోగులు చేట్టిన దీక్షకు వారు సంఘీ భావం తెలి పారు. ఉద్యోగులకు న్యాయం చేయక పోతే తాముకూడా దీక్షలకు దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
విఫలమైన అధికారుల చర్చలు
బీజేపీ నేతలు అంజన్‌కుమార్, రామచంద్రారెడ్డిలతో టీటీడీ అధికారులు చేసిన చర్చలు విఫలమయ్యాయి.టీటీ డీ ఏఈవో సబ్రమణ్యం,ఆర్కే వ్యాలీ ఎ స్సై ప్రదీప్‌నాయుడు దీక్షను విరమిం చాలని కోరారు. టీటీడీ ఈవో, జేఈవో లు వచ్చి సమస్యలపై హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తామని వారు తేల్చి చెప్పారు.