
సాక్షి, అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అమరావతి జేఏసీ, టీడీపీలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. చలో అసెంబ్లీ, ముట్టడి వంటి కార్యక్రమాలకు ఎలాంటి అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ ఆందోళనకారులు.. పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. మందడం పొలాల్లో నుంచి సచివాలయం వెళ్లే దారి గుండా ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో గ్రామాల్లోకి వెళ్లి నిరసన తెలుపుకోవాలని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని పోలీసులు విఙ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో డీఎస్పీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ... ‘దయచేసి వెళ్లిపోండి. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించవద్దు’ అని ఆందోళనకారులను వేడుకున్నారు. ఇదిలా ఉండగా.. పచ్చ మీడియా మాత్రం ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. వివాదాన్ని పెద్దది చేసేందకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇక ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బంది గాయాలపాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.(అనుమతి లేదు... భద్రత కట్టుదిట్టం)
అసెంబ్లీ ముట్టడికి టీడీపీ శ్రేణుల విఫలయత్నం
అసెంబ్లీ ముట్టడికి టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఆందోళనకారులు రాళ్లు విసిరి పోలీసులను గాయపరిచారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం సంయమనంతో వ్యవహరించి టీడీపీ శ్రేణులు ప్రయత్నాన్ని తిప్పికొట్టారు. దీంతో పోలీసు వలయాన్ని ఛేదించలేక ఆందోళనకారులు వెనుదిరిగారు.
కాగా సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల సూచనల మేరకు అసెంబ్లీతో పాటు ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో చెక్‌పోస్టులు, అవసరమైన చోట మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్ని రెండ్రోజుల ముందునుంచే బాంబ్‌స్క్వాడ్ బృందాలతో జల్లెడ పట్టిన పోలీసులు,. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఖరారు చేశారు.