హైదరాబాద్: రాష్ట్ర విభజనపై రోజుకో లీకుతో, గంటకో బ్రేకుతో ముందుకెళుతున్న కేంద్రపై ప్రభుత్వ విప్ పద్మరాజు మండిపడ్డారు. విభజనపై కేంద్రం లీకులిచ్చుకుంటూ కాలయాపన చేస్తుందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం కేంద్రం వినిపిస్తున్న రాయల తెలంగాణ కూడా అదే కోవలోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన విభజనపై కేంద్ర అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. అసెంబ్లీలో విభజన నెగ్గించుకునేందుకు రాయల తెలంగాణ ప్రతిపాదన తెరమీదకు తీసుకువచ్చిందేమోనని పద్మరాజు అనుమానం వ్యక్తం చేశారు.
రాయల తెలంగాణను సీమ ప్రజలెవరూ కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని పద్మరాజు తెలిపారు. ఇరు ప్రాంతాల్లో సమాన అసెంబ్లీ సీట్ల కోసం.. రాయల తెలంగాణ ఆలోచన సరికాదని కేంద్రానికి సూచించారు.