డొక్కు బస్సులకు చెక్‌.. | Purchase Of New Buses In Cooperation With The AP Government | Sakshi
Sakshi News home page

డొక్కు బస్సులకు చెక్‌..

Published Sat, Oct 19 2019 12:01 PM | Last Updated on Sat, Oct 19 2019 12:02 PM

Purchase Of New Buses In Cooperation With The AP Government - Sakshi

కండిషన్‌ లేని అద్దె బస్సులు (ఫైల్‌)

ఎప్పుడాగిపోతాయో తెలియదు.. ఎక్కడాగిపోతాయో అంతు బట్టదు. ప్రయాణికులు గమ్యానికి చేరతారో లేదో అంతుబట్టదు. ఆర్టీసీలో ఆలాంటి డొక్కు బస్సులను పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాలం చెల్లిన బస్సులకు మోక్షం లభించనుంది. సంస్థపై ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో సమస్యలు పరిష్కారం కానున్నాయి. ఇటీవల మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాల్లో రూ.వెయ్యి కోట్ల రుణసాయంతో ఆర్టీసీ ఆర్థిక పరిపుష్టిని పెంచుకోవడానికి వీలవుతుందని కార్మిక సంఘాలు, అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యేకించి ఆ నిధులను కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించడంతో సంస్థ మనుగడ మెరుగుపడుతుంది.

సాక్షి, విజయనగరం అర్బన్‌: విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్టీసీ నార్ట్‌ ఈస్ట్‌ కోస్ట్‌ రీజియిన్‌ పరిధిలోని తొమ్మిది డిపోల్లో కాలం చెల్లిన బస్సులు 100 వరకు ఉన్నాయి. మోటారు చట్ట నిబంధనల మేరకు ప్రయాణికుల రవాణా భారీ వాహనాలకు జీవిత ప్రయాణ పరిమితులుంటాయి. ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌ సర్వీసుల బస్సుల జీవితకాలం 8 లక్షల కిలోమీటర్ల ప్రయాణం మాత్రమే. ఇంకా సామర్థ్యం ఉంటే పాసింజర్‌ బస్సు సర్వీసులుగా నడపవచ్చు. కానీ పాసింజర్‌ సర్వీసులకు 12 లక్షల కిలోమీటర్ల దూరంగా నిర్ధేశించారు. ఆ పరిధి దాటితే రోడ్డు మీద అవి తిరగడానికి వీల్లేదు. అంతవరకు 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన ఎక్స్‌ప్రెస్‌లను పాసింజర్‌ సర్వీసులుగా తిప్పుతారు. తరువాత 12 కిలోమీటర్లు తిప్పాక కాలం చెల్లిన బస్సులుగా మూలకు చేర్చుతారు.

తాజాగా నెక్‌ పరిధిలో మొత్తం 789 బస్సుల్లో ఒక్కొక్క డిపోల్లో 8 నుంచి 10 బస్సులను పూర్తి స్థాయిలో సామర్థ్యం లేనివిగా గుర్తించి వాటిని రోడ్డుపైకి పంపుతున్నారు. వాటిలో అధిక శాతం ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులున్నట్టు వివేదికలు చెబుతున్నాయి. ఇటీవల విఖాఖ నుంచి విజయనగరం వస్తున్న ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రఘు ఇంజనీరింగ్‌ కాలేజీ జంక్షన్‌లో ఆగిపోయింది. విశాఖ – విజయనగరం మధ్య జాతీయ రహదారిపై వారానికి కనీసం నాలుగు బస్సులైనా బ్రేక్‌డౌన్‌ అవుతూ దర్శనమిస్తాయి. రెండురోజుల క్రితం విజయనగరం నుంచి జామి మీదుగా వెళ్లే రూట్లో పల్లెవెలుగు బస్సు నిలిచిపోయింది.ఔ

అయిదేళ్లుగా కాలక్షేపం..  
సామర్థ్యం లేని బస్సులను ఏటా గుర్తించి వాటి స్థానంలో ప్రత్నామ్నాయంగా కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు అలాంటి చర్యలేవీ చేపట్టకుండా సామర్థ్యం లేని పాత బస్సులనే కొనసాగించిందన్న విమర్శలున్నాయి. సంస్థ  కార్మిక సంఘాలు ఈ విషయాన్ని అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. ఆర్టీసీ నార్త్‌ ఈస్టు కోస్ట్‌ (నెక్‌) రీజయన్‌ పరిధిలోని తొమ్మిది డిపోలలో 789 బస్సులున్నాయి. వీటిలో 587 బస్సుల సంస్థవి కాగా మిగిలినవన్నీ అద్దె ప్రాతిపదికన ఉన్నవే. అయితే సంస్థ బస్సుల్లో 208 వరకూ సుమారు 13 లక్షల కిలోమీటర్లు తిరిగినవని సమాచారం. మోటారు చట్టం ప్రకారం 11 నుంచి 12 లక్షల కిలోమీటర్ల మధ్య రవాణా చేసిన బస్సులను సర్వీసుల నుంచి తొలగించాల్సి ఉంది. సంస్థ మెకానికల్‌ విభాగం ద్వారా తనిఖీ చేశాక వాటి సామర్థ్యం మెరుగ్గా ఉందనిపిస్తే కొన్నాళ్ల వరకూ తిప్పుకొనే అవకాశం ఉంది. కానీ అలాంటి చర్యలేవీ చేపట్టకుండా గత పాలకులు కాలం చెల్లిన బస్సులను రోడ్డుపైకి  పంపుతున్నారన్న ఆరోపణలు వినిపించాయి. పైగా రోజుకు 300 కిలోమీటర్లు మాత్రమే తిరగాల్సిన బస్సుల్ని 400 కిలోమీటర్ల వరకూ నడిపిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫలితంగా శబ్ధ, వాయు కాలుష్యాలు, సమయాభావంలేని ప్రయాణం వంటి సమస్యలను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. దూర సర్వీసులలో ఇలాంటి బస్సులే ఏర్పాటు చేయడం వల్ల మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్లు కూడా మానసిక క్షోభను అనుభవిస్తున్నారని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. 

కొత్త బస్సులొస్తే  మెరుగైన సేవలు.. 
బస్సుల రవాణా సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించి సర్వీసులకు పంపుతాం. నెక్‌ రీజియన్‌లో సామర్థ్యం లేని 100 బస్సుల వరకూ తాజాగా రద్దు చేసి, వాటి స్థానంలో ప్రత్యామ్నాయ బస్సులను ఏర్పాటు చేశాం. రద్దు చేసిన బస్సుల్లో 12 లక్షల కిలోమీటర్లు నడిచినవి. వాటి స్థానంలో కొత్త బస్సులు వస్తే సంస్థ సేవలు మరింత మెరుగుపడతాయి. సామర్థ్యంలో లేని బస్సులను నిర్వహించడం లేదు. సంస్థకు ప్రభుత్వం ప్రకటించిన రుణసాయం కొత్తబస్సుల కొనుగోలుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.  
– కొటాన శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎంఈ,  ఆర్టీసీ నెక్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement