పుష్కరాల సందర్భంగా జిల్లాలోని దేవాలయాలకు భారీగా ఆదాయం సమకూరింది. పుష్కర స్నానాలు ఆచరించిన
♦ {పధాన ఆలయాలకు రూ కోట్ల రాబడి
♦ అన్నవరం ఆదాయం రూ.6.5 కోట్లు
♦ సత్యదేవుని ఆదాయం రూ.3 కోట్లు
సాక్షి, రాజమండ్రి : పుష్కరాల సందర్భంగా జిల్లాలోని దేవాలయాలకు భారీగా ఆదాయం సమకూరింది. పుష్కర స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. ఫలితంగా సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు ఆదాయం వచ్చింది. అన్నవరం సత్యనారాయణస్వామి అయినవిల్లి సిద్ధివినాయక, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి, అప్పనపల్లి బాలబాలాజీస్వామి, ద్రాక్షారామం భీమేశ్వరుడు, కోటిపల్లి సోమేశ్వరుడు, సామర్లకోట కుమారారామ భీమేశ్వరుడు, రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్, అయ్యప్పస్వామి ఆలయాలతోపాటు గోదావరి తీరంలోని వందలాది ఆలయాలకు దర్శనం, ప్రసాదాల విక్రయం, విరాళాల ద్వారా భారీమొత్తంలో ఆదాయం లభించింది. పుష్కరాల 12 రోజుల్లో అన్నవరం సత్యదేవుడికి అత్యధిక ఆదాయం సమకూరింది.
11 లక్షలకుపైగా భక్తులు స్వామిని దర్శించుకోగా రూ 6.5 కోట్ల ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన్నాన్ని 30 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. దర్శనం టికెట్ల ద్వారా రూ.30 లక్షలు, లడ్డూల విక్రయం ద్వారా రూ.30 లక్షలు, హుండీల ద్వారా సుమారు రూ.2 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిసింది. అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానానికి రూ. 60 లక్షల రాబడి వచ్చింది. అయినమిల్లి సిద్ధివినాయక స్వామి దేవస్థానాన్ని రూ.2.7 లక్షల మంది భక్తులు దర్శించుకోగా దాదాపు రూ.50 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ నిర్వాహకులు చెప్పారు. ఇవికాకుండా ఉభయ గోదావరి జిల్లాలలో ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని వందలాది ఆలయాలను భక్తులు దర్శించుకోవడంతో ఆలయాలకు రూ.50 కోట్లకుపైగా ఆదాయం లభించినట్లు అంచనావేస్తున్నారు.