‘ఆల్‌టైమ్’ అలక్ష్యం.. | Qualification machine security guards | Sakshi
Sakshi News home page

‘ఆల్‌టైమ్’ అలక్ష్యం..

Published Sun, Dec 15 2013 1:21 AM | Last Updated on Sat, Sep 15 2018 8:43 PM

‘ఆల్‌టైమ్’ అలక్ష్యం.. - Sakshi

‘ఆల్‌టైమ్’ అలక్ష్యం..

 = ఏటీఎంలలో కానరాని సెక్యూరిటీ గార్డులు
 = జిల్లాలో దాదాపు సగం ఏటీఎంలలో రక్షణ లేదు
 = భద్రతను పట్టించుకోని బ్యాంకర్లు
 = బెంగళూరు ఘటనతో పోలీసుల అప్రమత్తం
 = నోటీసులు ఇచ్చాం.. ఆకస్మిక తనిఖీలు చేస్తామంటున్న ఎస్పీ

 
ప్రధాన ఘటన జరిగితే గానీ మనవాళ్లకు మెలకువ రాదు.. ఇటీవల బెంగళూరు ఏటీఎంలో జరిగిన ఘోర ఘటనతోనూ బ్యాంకర్లలో కదలిక రాలేదు.. జిల్లాలో అనేక ఏటీఎంలలో కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం అసాంఘిక శక్తులకు అవకాశంగా మారింది. ఖాతాదారుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. ఏటీఎంల వద్ద ఖాతాదారుల భద్రత రీత్యా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని సాక్షాత్తూ ఎస్పీ ఆదేశించినా బ్యాంకర్లు అంతగా స్పందించలేదు. ఏటీఎంలకు బీమా ఉండటంతో సొమ్ము పోతే పరిహారం వస్తుంది కాబట్టి ఖాతాదారుల భద్రతను గాలికొదిలేశారన్న అపవాదు ఉంది.
 
 సాక్షి, మచిలీపట్నం : బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి క్యూలో ఉండి నగదు తీసుకునే పద్ధతి కష్టతరంగా మారడంతో పల్లెల్లోను, పట్టణాల్లోను ఏటీఎంలను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల ఏటీఎంల వద్ద చోటుచేసుకుంటున్న ఘటనలతో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. సెక్యూరిటీ గార్డు లేని ఏటీఎం వద్ద సీసీ కెమెరాలు పెట్టినా నేరాలను అదుపు చేసే పరిస్థితి లేదు.

నేరం జరిగాక సీసీ కెమెరాలో చూసి అందుకు బాధ్యులను పట్టుకునేందుకు మాత్రమే అది దోహదం చేస్తుంది. అదే సెక్యూరిటీ గార్డు ఉంటే నేరాన్ని అదుపుచేసేందుకు అవకాశం ఉంటుంది. గతంలో దేశంలోని పలు ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలలో వ్యభిచారం జరిగిన ఉదంతాలు అనేకం సీసీ కెమెరాల్లో చిక్కి అటు తరువాత ఇంటర్నెట్ పోర్టల్స్‌లో హల్‌చల్ చేశాయి.

తాజాగా బెంగళూరులో ఒక మహిళపై దాడిచేసి హత్యాయత్నం చేసిన ఆగంతకుడు అక్కడ సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో దర్జాగా వెళ్లిపోయాడు. ఇటువంటి ఉదంతాలు ఎన్ని జరిగినా బ్యాంకర్లను కదిలించలేకపోతున్నాయి. ఇటీవల జిల్లాలోని బ్యాంకర్లకు ప్రత్యేకంగా పోలీసులు సమావేశాలు నిర్వహించి భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు. తక్షణం సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని ఎస్పీ ఆదేశాల మేరకు ఆయా బ్యాంకర్లకు పోలీసులు నోటీసులు జారీచేసి రోజులు గడుస్తున్నాయి. అయినా వారిలో చలనం లేదు.
 
అరకొర జీతానికి ఆసక్తి లేదు...

వాస్తవానికి గంటల తరబడి నిలువు కాళ్లపై ఉండి విధులు నిర్వర్తించే సెక్యూరిటీ గార్డుల విషయంలో జీతం ప్రధాన సమస్యగా మారింది. వాస్తవానికి హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రముఖ పట్టణాలకు చెందిన సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలు అవసరమైన సెక్యూరిటీ గార్డులను సమకూరుస్తాయి. వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.8 వేల నుంచి 9 వేల వరకు జీతంగా ఇస్తారు. రికార్డుల్లో మాత్రం మొత్తం జీతం ఇచ్చినట్టు వారి చేత సంతకాలు తీసుకుని చేతికిచ్చేది రూ.3,500 నుంచి 4 వేలు మాత్రమే. దీంతో అరకొర జీతం చాలని సెక్యూరిటీ గార్డులు ఈ రంగం నుంచి వైదొలుగుతున్నారు. కొత్త వాళ్లెవరూ ఇటువైపు రావడంలేదు. దీంతో సెక్యూరిటీ గార్డుల కొరత తీవ్రంగా ఉంది.
 
 16 నుంచి తనిఖీలు : ఎస్పీ ప్రభాకరరావు

 జిల్లాలోని ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు ఉన్నదీ లేనిదీ పరిశీలించేందుకు ఈ నెల 16 నుంచి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు ‘సాక్షి’కి వివరించారు. ఇప్పటికే జిల్లాలోని బ్యాంకు మేనేజర్లకు ఏటీఎంల భద్రత విషయంలో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. తీసుకోవాల్సిన భద్రత చర్యలపై జిల్లాలోని అన్ని బ్యాంకులకు నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. సోమవారం నుంచి జరిపే తనిఖీల్లో ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులు లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement