ఏటీఎం క్యాష్ వ్యాన్ తో డ్రైవర్ పరారీ!
ముంబై:ఈమధ్య కాలంలో ఏటీఎం సెంటర్లలో చోరీలు మితిమిరిన సంగతి తెలిసిందే. ఇందుకు కొన్ని బ్యాంకులు భద్రతను మరింతగా పెంచి చోరీల నివారణకు చర్యలు చేపడుతున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది. మరి ఏకంగా ఏటీఏంలో జమ చేయాల్సిన క్యాష్ ను వ్యాన్ తో పాటు మిస్ చేస్తే ఏం చేయాలి. ఈ తరహా సంఘటనే వాణిజ్య రాజధాని ముంబైలో శుక్రవారం వెలుగుచూసింది. నవీ ముంబైలోని 'లాగీ క్యాష్'అనే సంస్థ సదరు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుని ఏటీఎంలలో క్యాష్ ను జమ చేస్తుంది. ఆ క్యాష్ ను ఒక వ్యాన్ లో ఏటీఎంలకు తరలించడమే ఆ సంస్థ పని. అయితే లాగీ క్యాష్ లో పనిచేసే అమర్ సింగ్ అనే డ్రైవర్ క్యాష్ పై కన్నేశాడు.
ఈరోజు కోటి రూపాయలకు పైగా ఏటీఎంలలో జమచేయాల్సింది.ఆ క్రమంలోనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకు ఆవ్యాన్ చేరింది. అక్కడ రూ.16లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంది. క్యాష్ ను ఏటీఎంలో పెట్టడానికి సెక్యూరిటీ గార్డు ఏటీఎం మిషన్ ను డౌన్ చేశాడు. అప్పటికే బయట నిలుచుని ఉన్న ఆ డ్రైవర్ ఇదే అదునుగా భావించి అక్కడ నుంచి ఉడాయించాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన అధికారులు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ వ్యాన్ తో డ్రైవర్ తీసుకుని పారిపోయిన డబ్బు విలువ ఒక కోటి 28 లక్షలు ఉంటుందని పోలీస్ అధికారి అన్సర్ పిర్జేజ్ తెలిపారు. అతను మతుంగ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించామన్నారు.