'రెడ్లు కూడా బీసీల్లో కలపమంటారు'
ఎవరిని పడితే వాళ్లను బీసీలో చేరుస్తామంటే ఒప్పుకోబోమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు.
అమరావతి: ఎవరిని పడితే వాళ్లను బీసీలో చేరుస్తామంటే ఒప్పుకోబోమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీల్లో చేరడానికి అవసరమైన అర్హతలు ఉంటేనే అంగీకరిస్తామని స్పష్టం చేశారు.అందరిని కలుపుకుంటూ పోతే ఇవాళ కాపులు... రేపు రెడ్లు కూడా బీసీ లో కలపమంటారని ఆయన వ్యాఖ్యానించారు. కాపులకు విద్య, ఉద్యోగాల రిజర్వేషన్లకు తమ సంఘం అంగీకరించబోదన్నారు. ఆ డిమాండ్ తమకు అభ్యంతరకరమని చెప్పారు. ఒక్కసారి బీసీలో చేరితే ఒక్కొక్కటి అమలు చేసేస్తారని, కనుక ఎలా చేస్తారో ప్రభుత్వం తమతో చర్చించాలని కోరారు.
నేతల ప్రకటనలు ఏవైనా చేస్తారు.. అవన్నీ జరగాలంటే చాలా సాంకేతిక సమస్యలు వస్తాయని అన్నారు. విద్య, ఉపాధి, చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇందుకు అవసరమైన కసరత్తు జరుగుతోందని, ఏపీలో కూడా పెంచాలని సీఎం చంద్రబాబును కోరుతున్నామన్నారు. బీసీలకు టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. బీసీల ప్రధాన డిమాండ్లను అమలు చేసేందుకు చంద్రబాబు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. ప్రధానమంత్రి మోదీకి చంద్రబాబు సన్నిహితుడు కనుక ఆయనే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఏపీలో బీసీ కార్పొరేషన్ నిధులు అర్హులకు అందడం లేదని చెప్పారు.