
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాచమల్లు
వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : మున్సిపల్ చైర్మన్, అధికారులు కలిసి ప్రొద్దుటూరును కసువుదిబ్బగా మార్చారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాయం ముందు బుధవారం నిర్వహించిన పారిశుద్ధ్య లోపంపై పోరు ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ధర్నాకు పట్టణంలోని వేలాది మంది మహిళలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూప్రొద్దుటూరును దోమల నిలయంగా తయారు చేశారని, జబ్బులకు ఆనవాలుగా చేశారన్నారు. ఊరంతా అపరిశుభ్రంగా మారిందని, ఎక్కడ చూసినా కుక్కలు, పందులు దుర్గంధాన్ని కలిగిస్తున్నాయన్నారు. మురికితో నిండిన కాలువల ద్వారా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని చెప్పారు. వీటి కారణంగా డెంగ్యూ, గన్యా, విషజ్వరాలతో ప్రజలు ఆస్పత్రి పాలవుతు రూ.వేలు. లక్షలు ఖర్చుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. వీటి నుంచి మమ్మల్ని కాపాడండని ధర్నా చేయాల్సి వచ్చినందుకు సిగ్గుగా ఉందన్నారు. అయితే మున్సిపల్ చైర్మన్‌కు, అధికారులకు చీమ కుట్టినట్‌లైనా లేదన్నారు. తాను ప్రతి రోజు ఉదయం 3 గంటల పాటు వార్డుల్లో తిరుగుతున్నానన్నారు.
ఎక్కడికి వెళ్లినా కనీసం పూటకు ఒకసారి నీళ్లు ఇవ్వండి, దోమలు లేకుండా చేయండని మహిళలు అడుగుతున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నాయకులను అణగతొక్కడానికి ఈ ప్రభుత్వం ఉపయోగపడుతుంది కానీ మంచి నీళ్లు ఇవ్వడానికి, దోమలు నివారించడానికి పని చేయదన్నారు. ప్రొద్దుటూరు బాగుపడాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని, మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ వాళ్లు కొనసాగినంత సేపు ఈ ఊరు దుర్గంధభరితమే అని అన్నారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలో పట్టణంలోని ప్రధానమైన నాలుగు మురికి కాలువలను ఎందుకు ఆధునీకరించలేదన్నారు. చిన్న కాలువల నీటిని ప్రధాన కాలువల ద్వారా ఊరి బయటికి పంపించాల్సి ఉందన్నారు. ప్రధాన కాలువ ఆర్టీసీ బస్టాండు వరకు మాత్రమే ఉండటంతో ఆ నీరంతా తిరిగి వెనక్కి వస్తుందని అన్నారు. డ్రైనేజి నీరు బయటికి పంపించాలంటే ఆర్టీసీ బస్టాండు తర్వాత భూమి కొనాల్సిన అవసరం ఉందన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల వందల మంది పిల్లలు డెంగీ వ్యాధితో మరణించారన్నారు. ఆ తల్లుల గర్భశోకానికి కారణం ఈ టీడీపీ నాయకులు కాదా అని అన్నారు. నాగేంద్ర నగర్‌లో ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు డెంగీతో మృతి చెందారని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు
టీడీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. కాలువలను శుభ్రంగా ఉంచండని నిరసన తెలియచేయడానికి మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో పందిరి ఏర్పాటు చేస్తే మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఇక్కడ పందిరి వేసి సభ నిర్వహించే అ«ధికారం వారికి లేదని కేసులు పెట్టారన్నారు. ఎమ్మెల్యేతో పాటు ధర్నాకు వచ్చిన మహిళలపై కూడా కేసు పెట్టండని వారు పోలీసులకు చెబుతున్నారన్నారు. మున్సిపల్ కాంపౌండ్‌లో మీటింగ్ పెట్టనివ్వద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై ఒత్తిడి తెస్తున్నారని మున్సిపల్ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి తనకు ఫోన్ చేశారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజాసమస్యల కోసం చేసే ధర్నాల్లో తనపై ఎన్నో కేసులు పెట్టారని, నీళ్ల కోసం చేసిన ధర్నాకు సంబంధించి కేసు పెడితే మూడేళ్లుగా కోర్టుకు తిరుగుతున్నానని, రెండు రోజుల క్రితం ఆ కేసు కొట్టేశారని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. కేసులు తనకు కొత్తకాదని, ప్రజల కోసం ఎన్ని కేసులైనా భరిస్తానని, ఎన్ని రోజులైనా జైల్లో ఉంటానని అది తనకు గౌరవమే తప్ప అగౌరవం కాదన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా తెల్లటి బట్టలు ధరించి చైర్మన్ ఏసీ రూముల్లో కూర్చుంటున్నారని తెలిపారు. రోజు కార్యాలయానికి వచ్చి కాంట్రాక్టులకు ఎంత కమీషన్ వస్తుందోనని చూసుకొని వెళ్తారన్నారు.
పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచకుంటే72 గంటల నిరాహార దీక్ష
ఈ రోజు నుంచి వారం రోజుల్లోగా పట్టణంలో స్పెషల్ డ్రైవ్ ఆపరేషన్ నిర్వహించి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలన్నారు. లేకపోతే ఇదే స్థానంలో 72 గంటల పాటు ఎలాంటి ఆహారం ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళలు, వైఎస్సార్‌సీపీ పట్టణా«ధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, కౌన్సిలర్, ఎమ్మెల్యే సతీమణి రాచమల్లు రమాదేవి, పార్టీ నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment