సీమాంధ్రలో కాంగ్రెస్ నేతల వలసలతో పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు.
మాజీ మంత్రులకు రఘువీరా ఫోన్
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెస్ నేతల వలసలతో పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. విభజన నిర్ణయాన్ని విబేధిస్తూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రులు మహీధర్‌రెడ్డి, పార్థసారథిలతో ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ను వీడే విషయంలో తొందరపడొద్దు. మాట్లాడుకుందాం రండి’’అని సూచించినట్లు తెలిసింది. వారితో పాటు పార్టీని వీడతారని భావిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులకూ ఫోన్ చేసి బుజ్జగించేందుకు ప్రయత్నించారు.
అదే సమయంలో సీమాంధ్రలోని 13 జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కమిటీ అధ్యక్షులకు ఫోన్లు చేసి... పార్టీని వీడతారని అనుమానం ఉన్న నాయకుల జాబితా తనకు పంపాలని ఆదేశించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి బాగోలేనప్పటికీ రాబోయే స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పోటీ చేయాలనుకునే ఆశావహుల జాబితానూ రెండ్రోజుల్లో పీసీసీకి పంపాలని ఆదేశించారు.