సాక్షి, కర్నూలు : సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థులు వలసల బాట పడతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తీరు నచ్చక అధికార టీడీపీ నుంచి భారీగా వలసలు పెరగగా.. ఉన్న అర కొర నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. దీంతో ఏపీ కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వాఖ్యలను చూస్తే పార్టీనీ వీడేందుకే సిద్దపడినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఏపీలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి రఘువీరానే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన ఉంటే పార్టీ నాశనం అవుతుంది
‘కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి గ్రామ గ్రామానికి తిరుగుతూ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. నేను పాదయాత్రను చేపడితే రఘువీరా అడ్డుపడ్డారు. ఇంకో నాయకుడు ఎదగడం ఆయనకు ఇష్టం ఉండదు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని రఘువీరా మరింత దిగజార్చారు. అయన కోటరీలో అందరూ చెంచాలే ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నాలుగు ఓట్లు వేయించలేదు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరూ చేరని పరిస్థితుల్లో నేను బలోపేతం చేశాను. పీసీసీ అధ్యక్ష పదవి మతి స్థిమితం లేని వ్యక్తి చేతిలో పెట్టారు.
తిరుపతిలో భరోసా యాత్రను రఘువీరా రెడ్డి నీరు గార్చారు. కాంగ్రెస్ నాశనం కావడానికి రఘువీరానే కారణం. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రఘువీరాపై మాకు నమ్మకం లేదు. ఆయన ఉంటే పార్టీ నాశనం అవుతుంది. నేను, మా నాయకులు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయము.. రేపు కార్యకర్తల సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము’అంటూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment