ఫోన్ కాల్ అంటేనే భయపడుతున్న.. మంత్రి!
హైదరాబాద్ : వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రూపంలో తలనొప్పి వచ్చి పడింది. ప్రభుత్వం రైతు రుణ విముక్తి పథకం గురించి గొప్పగా చెప్పుకుంటోందని, ఆ పథకం కేవలం డొల్ల మాత్రమేనని విమర్శించిన రఘువీరారెడ్డి ఈ పథకంపై ఏమైనా సందేహాలుంటే నేరుగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫోన్ చేయాలని నేరుగా మంత్రి సెల్‌ఫోన్ నంబరు వెల్లడించారు.
దీంతో మంత్రికి క్షణం తీరిక లేకుండా వరుసగా ఫోన్లు శర పరంపరగా వస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వరుసగా వస్తున్న ఫోన్లతో ఆయనకు క్షణం కూడా తీరిక లేకుండా పోతోందట. రుణాల మాఫీ సంగతేంటంటూ ప్రతి ఒక్కరూ ఫోన్ చేయడమే కాకుండా కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు మాట్లాడుతున్నారట. రైతు సమాచారం కోరుతూ మాట్లాడే సమయంలో మధ్యలోనే కట్ చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్న భయంతో కొన్ని ఫోన్లు మాట్లాడారట.
ఇక లాభం లేదనుకున్న మంత్రివర్యులు ఫోన్లకు సమాధానం చెప్పేందుకు ప్రత్యేకంగా పీఏను కేటాయించారు. ఆయన అదే పనిలో నిమగ్నమై ఉన్నా సందేహాలు తీర్చుకునేందుకు ఫోన్ చేసిన రైతులు పీఏ చెప్పిందంతా విన్న తరువాత మీరెవరని ప్రశ్నించి.. పీఏ అన్న సమాధానం రాగానే రైతులు మంత్రిగారేమయ్యారంటూ నిట్టూరుస్తున్నారట. ఈ విషయం ఆయనే మీడియాకు చెప్పుకోగా, అది విన్న టీడీపీ సహచరుడొకరు విరుగుడు మంత్రం బోధించారు.. మంత్రిగారికెందుకు తంటాలు..! అదేదో ముఖ్యమంత్రి ఫోన్ నంబర్ ఇస్తే పోలే..!