
అగ్నికీలల్లోనే శేషాచలం
తిరుమల శేషాచల అడవి మంటల్లో చిక్కుకుని బుగ్గి అవుతోంది. ఆలయానికి కిలోమీటరు దూరంలోని ఉత్తర, ఈశాన్య దిశలో కాకుల కొండ వద్ద 40 అడుగుల ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.
సాక్షి, తిరుమల/హైదరాబాద్ : తిరుమల శేషాచల అడవి మంటల్లో చిక్కుకుని బుగ్గి అవుతోంది. ఆలయానికి కిలోమీటరు దూరంలోని ఉత్తర, ఈశాన్య దిశలో కాకుల కొండ వద్ద 40 అడుగుల ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. వివిధ శాఖలకు చెందిన 500 మంది సిబ్బంది, 15 ఫైరింజన్లు రంగంలోకి దిగినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, రక్షణ దళాల సహకారాన్ని కోరింది. బుధవారం గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీటీడీ ఉన్నతాధికారులతో సంప్రదించారు. అనంతరం రక్షణ దళాలను రంగంలోకి దించే ఏర్పాట్లు చేశారు. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు చెందిన రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లను, నాలుగు హెలికాప్టర్లను, వంద మంది సిబ్బందిని తిరుపతికి తరలిస్తున్నారు.
శేషాచలం అడవుల్లో మంగళవారం మూడు ప్రాంతాల్లో అడవి అంటుకుంది. అంతకంతకూ విస్తరించిన మంటలు బుధవారం మరింతగా చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 10 కిలోమీటర్ల విస్తీర్ణంలోని సుమారు 2 వేల హెక్టార్ల అడవి బూడిద యింది. టీటీడీ పవన విద్యుత్ ప్లాంట్ దెబ్బతింది. నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, చిత్తూరు జిల్లా కలెక్టర్ రాంగోపాల్, సీవీఎస్‌వో శ్రీనివాసరావు, అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు బుధవారం సంఘటన స్థలాన్ని సందర్శించి మంటలు ఆర్పేందుకు ప్రత్యేక బృందాలను రప్పించారు. అటవీ శాఖ, అగ్నిమాపక శాఖల సిబ్బందితోపాటు టీటీడీ ఇంజనీరింగ్, హెల్త్, విజిలెన్స్, పోలీసు విభాగాలకు చెందిన 500 మందితో పది బృందాలను ఏర్పాటు చేశారు.
చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్‌ఆర్ జిల్లాల నుంచి 15 ఫైరింజన్లను తెప్పించారు. నీటి సరఫరాకు టీటీడీకి చెందిన ఆరు ట్యాంకర్లు, గుంతలు తవ్వేందుకు ఆరు జేసీబీలు తెప్పించారు. ఈ బృందాలు కాకుల కొండ నుంచి గోగర్భం డ్యాము వరకు మంటలు విస్తరించకుండా చర్యలు తీసుకున్నాయి. కాకులకొండ దిగువ ప్రాంతంలో సాయంత్రం 6 గంటలకు మంటలు కొంత అదుపులోకి వచ్చినా, పవన విద్యుత్ ప్లాంటు సమీపంలో చెలరేగుతూనే ఉన్నాయి. పాపవినాశనం, అవ్వాచ్చారికోన, కపిలతీర్థం, కరకంబాడి, మామండూరు ప్రాంతాల్లో కూడా మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి సిబ్బంది కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో రక్షణ దళాల సహకారం తీసుకోవాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. డిఫెన్స్, ఎయిర్‌ఫోర్సుకు ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌లను తెప్పించాలని నిర్ణయించారు. ఆగమ నిబంధనల ప్రకారం తిరుమల కొండపై హెలికాప్టర్లు, విమానాలు ఎగురకూడదు. ఇప్పటివరకు ఈ నిబంధనను కచ్చితంగా అమలుచేశారు. అయితే, ఇప్పుడు కార్చిచ్చు అంతకంతకూ వ్యాపిస్తుండటంతో ఆలయ అర్చకులు కూడా సానుకూల దృక్పథంతో హెలికాప్టర్లు తెప్పించేందుకు అంగీకరించారు.
రంగంలోకి రాష్ట్రప్రభుత్వం: తిరుమల కొండల్లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. యుద్ధప్రాతిపదికన సహాయ సహకారాలు అందించాలని బుధవారం కేంద్ర ప్రభుత్వానికి, ఆర్మీ, నేవీకి విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం, రక్షణ దళాలు, కేంద్ర విపత్తు నిర్వహణ విభాగాలు తక్షణమే స్పందించాయి. రాష్ట్ర ప్రభుత్వం కొరిన మేరకు ఏర్పాట్లు చేశాయి. గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) గిరిధర్ గోపాల్, చిత్తూరు కలెక్టర్ రాంగోపాల్‌తో మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించారు. ఎయిర్‌ఫోర్స్, నేవీ అధికారులతో గవర్నర్ స్వయంగా మాట్లాడారు.
మంటలను ఆర్పేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన విమానాలను, నిపుణులను పంపాలని ఎయిర్‌ఫోర్సు, నేవీ, ఇతర సాయుధ బలగాల అధిపతులను కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి బుధవారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శితో, రక్షణ అటవీ, విపత్తు నిర్వహణ శాఖల కార్యదర్శులతో ఫోన్‌లో మాట్లాడారు. రసాయనాలను వెదజల్లి మంటలను ఆర్పే ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్‌లు రెండింటిని పంపాలని ఆర్మీ, నేవీని కోరారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లను, నాలుగు హెలికాప్టర్లను, వందమంది సిబ్బందిని వెంటనే పంపుతామని రక్షణ దళాల అధికారులు తెలిపారు. రసాయనాలతో మంటలను ఆర్పే ప్రత్యేక ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎయిర్‌ఫోర్సు, నేవీ అధికారులు తిరుపతి రానున్నారని గవర్నర్ టీటీడీ ఈవోకు తెలిపారు. వారితో నేరుగా సమన్వయం చేసుకోవాలని, ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని సూచించారు. టీటీడీ ఈవో గోపాల్ కూడా కేంద్ర రక్షణ మంత్రి, కేబినెట్ కార్యదర్శి, ఎయిర్‌ఫోర్సు అధికారులతో కూడా చర్చించారు.
నీరు, నురగతో కూడిన రసాయనాలను గగనతలం నుంచి చల్లి మంటలను ఆర్పేందుకు నేవీ, ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎంఐ-17 హెలికాప్టర్లు తిరుమలకు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బుధవారం ఓ హెలికాప్టర్ శేషాచలంపై చక్కర్లు కొట్టి అగ్నిప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో సర్వే చేసి వెళ్లింది. ఆగమ నిబంధనలను అతిక్రమించకుండా ఏర్పాట్లు చేశామని ఈవో చెప్పారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ పార్థసారథి కూడా జాతీయ విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడారు. బుధవారం తమిళనాడు అరక్కోణం నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా తిరుమల చేరుకున్నాయి. తిరుపతిలోనే బస చేసిన రాష్ట్ర అటవీ దళాల అధిపతి బి.సోమశేఖరరెడ్డి ఢిల్లీలోని అటవీ శాఖ డెరైక్టర్ జనరల్ గార్బియల్‌తో మాట్లాడి పరిస్థితిని వివరించారు. మంటలను ఆర్పే పనులు పగలంతా చురుగ్గా సాగాయని, మూడు చోట్ల మంటలు అంటుకోగా రెండు చోట్ల పూర్తిగా అదుపులోకి వచ్చాయని సోమశేఖరరెడ్డి ‘సాక్షి’కి టెలిఫోన్‌లో తెలిపారు. రాత్రి సమయంలో మంటలను ఆర్పడం వీలుకానందున పని ఆపేశారని, తిరిగి గురువారం ఉదయమే ప్రారంభిస్తామని చెప్పారు.
ఆందోళన వద్దు : గవర్నర్, ఈవో
శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగినప్పటికీ, భక్తులు ఎలాంటి ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదని గవర్నర్ నరసింహన్, టీటీడీ ఈవో గోపాల్ చెప్పారు. ఎప్పటిలానే శ్రీవారి దర్శనానికి రావచ్చని ఈవో చెప్పారు. తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని గవర్నర్ తెలిపారు. వివిధ ప్రాంతాలకు మంటలు చెలరేగడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భక్తుల భద్రత కోసం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పాపవినాశనం, ఆకాశగంగ, జాపాలీతీర్థం, వేణుగోపాల స్వామి ఆలయాలకు వెళ్లే మార్గాలను, అక్కడి దుకాణాలను మూసివేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే కాలిబాటను కూడా మూసివేశారు.
నేడు తిరుపతిలో అటవీ శాఖ డీజీ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: కేంద్ర అటవీ శాఖ డెరైక్టర్ జనరల్ (డీజీ) ఎస్‌ఎస్ గార్బియల్ గురువారం ఉదయం తిరుపతిలో వివిధ రాష్ట్రాల అటవీ అధికారులతో సమావేశమవుతున్నారు. రాష్ట్రాల నుంచి ఏనుగుల వలస సమస్య, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల అటవీశాఖల ఉన్నతాధికారులు, వన్యప్రాణి సంరక్షణాధికారులతో చర్చిస్తారు. ఆయన పర్యటన పది రోజుల కిందటే ఖరారైంది. అయితే, గత మూడు రోజులుగా శేషాచలం అడవుల్లో మంటలు రేగుతుండటంతో, ఈ అంశంపై కూడా ఆయన సమీక్షించే అవకాశం ఉంది.