
మళ్లీ మొండిచేయి
సంగడిగుంట (గుంటూరు) : కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లో గుంటూరు రైల్వే డివిజన్‌కు మొండి చెయ్యి చూపించింది. కొత్త ప్రభుత్వం నుంచి అదనపు రైళ్లు, మౌలిక సదుపాయాల కల్పన, నిధులు రాబడతామని నేతలు ఇచ్చిన హామీలు ఆచరణకు నోచుకోలేదు.
విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ప్రకటించిన రైలు వల్ల గుంటూరు జిల్లాకు కొత్తగా ఒనగూరిందేమీ లేదు. ఢిల్లీకి ఇప్పటికే చాలా రైళ్లు విజయవాడ మీదుగా నడుస్తున్నాయి. నూతన బడ్జెట్‌లో గుంటూరు రైల్వే డివిజన్‌కు ప్రత్యేక కేటాయింపులు లేవు, కొత్త రైళ్లు లేవు.దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పెండింగ్‌లో ఉన్న 29 పనులకు రూ. 20 వేల కోట్లను ప్రకటించినా ఆ నిధుల్లో గుంటూరు డివిజన్‌కు ఎంత మొత్తం కేటాయించిందీ స్పష్టత లేదు.
ఎక్కడికక్కడ పేరుకుపోయిన సమస్యలను కేంద్ర రైల్వేశాఖ అసలు పరిగణలోకి తీసుకున్నట్లు లేదు.దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలకు ప్రకటించిన తొమ్మిది రైళ్లలో కేవలం ఒకే ఒక్క రైలును తిరుపతికి కేటాయించారు. అది గుంటూరు మీదుగా వెళుతుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.
నిరాశే మిగిలింది..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైల్వే బడ్జెట్‌లో గుంటూరు డివిజన్‌కు వరాల జల్లు కురుస్తుందని ఆశించాం. కానీ నిరాశే మిగిలింది. నమ్ముకున్న ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రయత్నాలు చేయని విషయం స్పష్టం అవుతోంది. బడ్జెట్ ముందు రోజు హడావుడి చేయడంవల్ల ఉపయోగం ఉండదనే విషయాన్ని గుర్తించలేకపోయారు. ఇకనైనా బడ్జెట్ తయారీకి నెల రోజులకు ముందే ప్రతిపాదనలు పంపాలి.
- ఎ. అశోక్ కుమార్, గుంటూరు
కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది
ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా గుంటూరు రైల్వే డివిజన్‌కు ప్రత్యేకంగా ఏ విధమైన ప్రాజెక్టులూ ప్రకటించకుండానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుని మోసపోయాం. ప్రజాప్రతినిధులు హామీలు ఆచరణకు నోచుకోలేదు.
- కె. గోవిందరెడ్డి, గుంటూరు