జిల్లాకు రైల్వే పరంగా ఏమీ ఒరగలేదు. ఆశించినంతగా బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడంతో ప్రయాణీకులు మండిపడుతున్నారు. ఇక్కడి నేతలూ ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం కూడా వారి ఆగ్రహానికి కారణమవుతోంది. గత నిర్ణయాలకూ నిధుల మంజూరి కాకపోవడమూ విమర్శలకు తావిస్తోంది.
స్టేషన్ మహబూబ్‌నగర్, గద్వాల, న్యూస్‌లైన్: కేంద్ర రైల్వేశాఖమంత్రి మల్లికార్జున్ ఖర్గే బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ రైల్వేబడ్జెట్‌లో పాలమూరు జిల్లా మీదుగా మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడిపేందుకు ఓకే చేశారు. గత రెండేళ్ల నుంచీ రైల్వే బడ్జెట్‌లో ఫలక్‌నూమా నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పనులు చేపట్టాలని ప్రతిపాదించినా అవి కేవలం సర్వేలకే పరిమితం చేశారు. తాజాగా వాటి ఊసే లేదు. ఆర్‌ఓబీల విషయంలో ఏమాత్రం పట్టించుకోనట్లు కనిపిస్తోంది.జిల్లాలో ఉన్న 50కి పైగా కాపలాలేని లెవల్ క్రాసింగ్ గేట్ల విషయంలోనూ పట్టించుకోలేదు.
డబుల్ డెక్కర్ పరుగులు తీయనుంది...
రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున్ ఖర్గే పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో పాలమూరు జిల్లాకు మూడు వీక్లి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రకటించారు.
కొత్తగా బడ్జెట్‌లో ప్రకటించిన వివరాల ప్రకారం కాచిగూడ-గుంటూరు, కాచిగూడ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ డబుల్‌డెక్కర్ రైళ్లు జిల్లా మీదుగా పరుగెత్తనున్నాయి. కాచిగూడ-నాగర్‌సోల్ వీక్లిరైల్ కూడా ఇలానే వెళ్లనుంది.
కనిపించని కరుణ...
మహబూబ్‌నగర్, గద్వాల, జడ్చర్ల, షాద్‌నగర్ తదితర ముఖ్యమైన రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలూ లేవు. మహబూబ్‌నగర్, గద్వాల రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించి నాలుగేళ్లు గడచినా ఎటువంటి పనులు జరగలేదు. ఈ బడ్జెట్‌లోనైనా రైల్వే స్టేషన్లలో సౌకర్యాల మెరుగు, ఆధునికీకరణకు నిధులొస్తాయనుకున్నా ఎటువంటి నిధులు కేటాయించలేదు.
ఇటీవల ప్రతిపాదించిన ద్రోణాచలం నుంచి వయా గద్వాల, రాయచూరుల మీదుగా ముంబైకి వెళ్లే రైళ్ల ప్రస్తావన కనిపించడం లేదు. గద్వాల - రాయచూర్‌ల మధ్య ఈ బడ్జెట్‌లో ఒక్క రైలును కూడా అదనంగా నడిపేందుకు నిర్ణయించలేదు. దీనితో ఈ ప్రాంత ప్రజలకు నిరాశను కల్పించేలా ఉంది. గద్వాల - మాచర్ల రైల్వే లైన్, మహబూబ్‌నగర్ -గుత్తి డబుల్ లైన్‌లకు బడ్జెట్‌లో మోక్షం కల్పించలేకపోయారు. ఇక గద్వాల రైల్వే జంక్షన్‌లో శిక్షణా సంస్థల ఏర్పాటు, గద్వాల జంక్షన్ అభివృద్ధికి నిధులు వంటి ప్రస్తావన లేనే లేదు. పగటి పూట నడిచే కాచిగూడ -తిరుపతి, గుంటూరు - కాచిగూడ డబుల్ డెక్కర్ రైళ్లతో హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అదనపు సౌకర్యంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతి డబుల్ డెక్కర్ రైలు ఈ ప్రాంతంనుంచి వెళ్లే భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది.
ఈ‘సారీ’ అంతే...!
Published Thu, Feb 13 2014 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM
Advertisement
Advertisement