
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం శ్రీలంక పరిసరాల్లో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఇది రానున్న 24 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
అదే సమయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు.