రాంరెడ్డి, రేణుక వర్గీయుల విమర్శల యుద్ధం
Published Fri, Oct 11 2013 3:44 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
సాక్షి, కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్‌లో నిట్టనిలువునా చీలిక వచ్చింది. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చేసిన విమర్శలతో ఇరువురి అనుచరులు రెండువర్గాలుగా విడిపోయారు. అంతేకాకుండా ఇరువురి అనుంగు నేతలు డీసీసీ కార్యాలయం వేదికగా తమ నేతలను వెనకేసుకొని వస్తూ విమర్శలకు దిగారు. మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి రెండురోజుల క్రితం రేణుకపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం, రేణుక వర్గీయులు ఈ వ్యాఖ్యలను ఖండించిన విషయం విదితమే. ఈనేపథ్యంలోనే గురువారం డీసీసీ కార్యాలయం వేదికగా మంత్రి అనుచర మాజీ కౌన్సిలర్లు, కొంతమంది ముఖ్యనాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రేణుకాచౌదరిపై విమర్శలు గుప్పించారు. మళ్లీ ‘ఎక్కడి ఆడబిడ్డవో చెప్పాలని, తెలంగాణ వ్యతిరేకి’ అంటూ ఆరోపణలు చేశారు.
అంతేకాకుండా మంత్రి అనుచరుడు, ఇల్లెందు నియోజకవర్గ ఇన్‌చార్జి కోరం కనకయ్య కూడా ఆమెపై నిప్పులు చెరిగారు. బయ్యారం, కూసుమంచి, టేకులపల్లి, కామేపల్లిలో మంత్రి అనుచరులు ఆయనకు మద్దతుగా రేణుకపై విమర్శల దాడి చేశారు. కాగా, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేణుకాచౌదరి జిల్లా అభివృద్ధికి ఎంతో చేశారని, ఆమెను ఎప్పటికీ జిల్లా ప్రజలు ఆడబిడ్డగానే చూసుకుంటారని పేర్కొన్నారు.
అంతేకాకుండా... ఈనెల 13,14 తేదీల్లో రేణుకా చౌదరి ఖమ్మంలోనే ఉంటారని, రేణుకకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు దమ్ము, సత్తా ఉంటే ఆ రోజు వచ్చి ఆమె ఎదురుగా విమర్శలు చేయాలని సవాల్ చేశారు. ఇలా ఇరువురు నేతల మధ్య ఉన్న విభేదాలు బహిరంగం కావడం, వర్గాల వారీ బలప్రదర్శనకు దిగడంతో రాజకీయం వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా డీసీసీ కార్యాలయం సాక్షిగా ఇరువర్గాల అనుచరులు విమర్శలు సంధించుకుంటూ సవాళ్లు విసురుకుంటుంటే పార్టీ శ్రేణులు విస్తుబోతున్నాయి. ఈవివాదంలో... మంత్రి వర్గంగా ముద్ర పడిన వారు పూర్తిగా ఆయనకే మద్దతు పలుకుతుండగా.. మరికొంత మంది రేణుకను కాదంటే చివరకు ఆమె ఏం చేస్తారోనని జంకుతూ మధ్యేమార్గంగా ఉంటున్నారు.
కృతజ్ఞత సభతోనే కౌంటర్ యాక్షన్...
తనను తెలంగాణ కృతజ్ఞత సభకు రానివ్వకుండా మంత్రి వేస్తున్న పాచికలు పారవని.. తనకు అహ్వానం ఉంటుందని..ఈ సభతోనే మంత్రికి గుణపాఠం చెబుదామని...రేణుక తన అనుచరులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. మంత్రి వ్యాఖ్యలను డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు కూడా ఖండించడంతో ఆమె వనమా ద్వారానే తన అనుచర గణానికి ఈ విషయమై ఫోన్‌లో గత రెండు రోజులుగా చెప్పించినట్లు తెలిసింది. కృతజ్ఞత సభకు ఎలాగైనా ఆహ్వానం అందుతుందని.., సభతోనే మంత్రి, ఆయన అనుచర వర్గం నోళ్లు మూయిద్దామని చర్చించినట్లు సమాచారం. అప్పటి వరకు మంత్రిపై జిల్లా వ్యాప్తంగా తన అనుచర నాయకులతో విమర్శలు చేయించాలని వనమాను ఆదేశించినట్లు తెలిసింది.
ఈ చిచ్చు ఆరేనా..?
ఒకపక్క తెలంగాణ వస్తుందన్న సంబరాల్లో ఉండాల్సిన తరుణంలో పార్టీలో చెలరేగిన చిచ్చుపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాదం ఇప్పుడే సమసిపోయేలా లేదని, ఈ ప్రభావం తెలంగాణ కృతజ్ఞత సభపై పడుతుందని, అధిష్టానం లేదా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటేనే సయోధ్య కుదురుతుందని అంటున్నారు. కాగా, త్వరలో జిల్లాకు రేణుకాచౌదరి వస్తున్నారని ఆమె అనుచర నేతలు ప్రకటించడంతో ఆమె ప్రత్యక్ష స్పందన ఎలా ఉంటుందోనని, కల్లోలం ఎటుతిరిగి ఎటు వస్తుందోననే చర్చ జోరుగా నడుస్తోంది.
Advertisement