ఇదీ మండలంలో అధికారుల పనితీరు
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
తాడేపల్లి రూరల్ : తాడేపల్లి మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు వాటివైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అమరావతిలోని ఓ ప్రైవేటు క్వారీ నుండి మంగళవారం ఉదయం బిల్లులతో ఇసుక లోడుతో వస్తున్న నాలుగు లారీలను తాడేపల్లి తహశీల్దార్ వెంకటేశ్వర్లు ఆపి, వాటిని పరిశీలించారు. ఆ బిల్లుల్లో వినియోగదారుడి పేరు లేదని, అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని లారీలను నిలిపివేశారు. వే బిల్లులు తీసుకుని తన కార్యాలయానికి వెళ్లారు. ఎక్కడి నుండో ఇసుక వస్తుంటే తాడేపల్లి అధికారులు ఆ లారీలను తనిఖీలు చేస్తున్నారే తప్ప.. మండలంలోని పెనుమాక ఇసుక రీచ్ నుండి రాత్రీ పగలూ తేడా లేకుండా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం మాతం చేయడం లేదు. ఇసుక రీచ్‌లో జరుగుతున్న అక్రమ రవాణా గురించి రోజూ పత్రికల్లో కథనాలు వస్తున్నా, వాటి గురించి ఆలోచించట్లేదు. పైగా ఎక్కడి నుండో వస్తున్న లారీలను తనిఖీ చేస్తుండడంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో పెనుమాకలో రాత్రి సమయాల్లో లారీలు తిరగడంపై ఆగ్రహించిన మహిళలు రోడ్డుపైకి వచ్చి గంటల కొలదీ లారీలను నిలిపి ధర్నా చేశారు. అప్పుడు పత్తాలేని అధికారులు ఇప్పుడు మాత్రం చిన్న సాకుతో లారీలను నిలిపేసి, హడావుడి సృష్టించడం వెనుక పరమార్థమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ పెనుమాక రీచ్‌లో బిల్లులు లేకుండా అక్రమ ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఆ ఇసుక రీచ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులది కావడం వల్లే అధికారులు దాని జోలికి వెళ్లడం లేదని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
బిల్లులుంటే అక్రమం.. లేకుంటేనే సక్రమం!
Published Thu, Jan 14 2016 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM
Advertisement
Advertisement