
రంగస్థలం షూటింగ్ సమయంలో రామ్‌చరణ్‌తో శ్రీనివాస్
అరసవల్లి : ‘ఈ సిట్టిబాబు సెవిలోకి మాటెల్లడం కష్టం గానీ...’ అంటూ చరణ్ పలికిన డైలాగులు ఇంకా ఎవరి చెవినీ దాటిపోలేదు. ఇలాంటి డైలాగుల వెనుక ఉన్న జట్టులో రొంగలి శ్రీనివాస్ కూడా ఒకరు. యాభై రోజుల కిందట విడుదలై సూపర్ హిట్ కొట్టిన రంగస్థలం సినిమాకు ఆయన రచయితగా పనిచేశారు. సహాయ స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. ఆయన శుక్రవారం కుటుంబ సమేతంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఇలా ముచ్చటించారు.
సాక్షి: రంగస్థలం రచయితగా అవకాశం ఎలా వచ్చింది..?
రొంగళి: సినిమాల్లో రచయితగా అరంగ్రేటం చేసి సుమారు పదేళ్లు అయ్యింది. డైరెక్టర్ సుకుమార్ వద్ద చాలా కాలంగా పనిచేస్తూ ఉండడంతో రంగస్థలంకూ పనిచేశాను. ఈ సినిమాకు సహాయ స్క్రీన్‌ప్లే కూడా అందించాను. ఇప్పటి వరకు ఏడు సినిమాలకు రచయితగా పనిచేశాను. దాదాపుగా అన్నీ సూపర్ హిట్లే కావడంతో అవకాశాలు వస్తూ ఉన్నాయి.
సాక్షి: రంగస్థలంలో డైలాగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. దాని గురించి..
రొంగళి: థాంక్యూ.. నిజంగా డైలాగులు నాకు కూడా పేరుతెచ్చాయి. ఈ డైలాగ్స్‌ను 80ల్లో వా డుక భాషకు తగ్గట్టుగా రాసి ప్రేక్షకులకు మెప్పించడంలో సఫలమయ్యాననే ఆనందంగా ఉంది. అత్త అనసూయతో హాస్యం, ప్రేయసి సమంతతో ప్రే మ, అన్న ఆది పినిశెట్టితో ఆప్యాయత, ప్రకాష్ రాజ్‌పై కసి ఇలా అన్ని రంగాల్లో డైలాగ్స్ అద్భుతంగా రావడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో వినిపించని వ్యక్తిగా చరణ్ నటనకు తగ్గట్టుగా డైలాగ్స్ రాశాను.
సాక్షి: మీరు ఉపాధ్యాయుడిగా పనిచేశారని తెలిసింది. నిజమేనా?
రొంగళి: అవును. విశాఖ జిల్లా చోడవరం నా సొంత ఊరు. కృష్ణా జిల్లాలో డైట్ చేసి తొలి ప్రయత్నంలోనే డీఎస్సీలో ఎంపికై చోడవరంలోనే ఉపాధ్యాయుడిగా పనిచేశాను. అయితే చిన్నప్పటి నుం చి సినిమాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వది లిపెట్టి సినీరంగంలోకి అడుగుపెట్టాను. ప్రేక్షకుల ఆదరణతో ఈరోజు ఈ స్థాయికి చేరాను.
సాక్షి: ఇప్పటివరకు చేసిన సినిమాల్లో మీకు నచ్చినవి ఏంటి?
రొంగళి: నాకు ఈ రంగంలో లైఫ్ ఇచ్చింది డైరెక్టర్ సుకుమార్. ఆయన దర్శకత్వ టీమ్‌లో నేను కూ డా కీలక సభ్యుడినే. నేను రచయితగా కుమారి 21ఎఫ్, నాన్నకు ప్రేమతో, వన్ తదితర చిత్రాల్లో పనిచేశాను. ఇప్పుడు రంగస్థలం వీటిలో బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టింది. నాన్నకు ప్రేమతో సినిమాలో నాన్నపై సెంటిమెంట్ డైలాగ్స్ కూడా మంచి పేరు తెచ్చాయి.
సాక్షి: శ్రీకాకుళం జిల్లాకు రావడం వెనుకఏమైనా ప్రత్యేకత ఉందా?
రొంగళి: ఉంది. రంగస్థలం సినిమా హిట్ అవ్వాలని, మా అక్క సుధ ఈ జిల్లాలోని శ్రీముఖలింగం ఆలయానికి వచ్చి అక్కడ పవిత్ర గోలెంలో కోరిక చెప్పిందట. అందుకే ఇలా వచ్చి మొక్కు తీర్చుకున్నాను. అలాగే ఎప్పటి నుంచో అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని కూడా దర్శించుకోవాలనే కోరిక తీరింది. అరసవల్లిలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కోడూరు సురేష్‌కుమార్ సహాయంతో ఆదిత్యున్ని దర్శించుకున్నాను. అలాగే శుక్రవారంతో రంగస్థలం సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. అందుకే నా స్నేహితుడు సురేష్ కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాను.
సాక్షి: భవిష్యత్ ప్రణాళికలేమైనా..!
రొంగళి: రచయితగా సక్సెస్ అయిన వారంతా దర్శకులుగా మారినట్లే.. నేను కూడా వచ్చే ఏడాది దర్శకత్వం చేసేందుకు సిద్ధమయ్యాను. కథను సిద్ధం చేసుకున్నాను. అయితే ప్రస్తుతం మహేష్‌బాబుతో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు సహాయ దర్శకత్వం, రచయితగా పనిచేస్తున్నాను. ఇది పూర్తయితే పూర్తి స్థాయిలో మెగా ఫోన్ పడతాను.
Comments
Please login to add a commentAdd a comment