రేషన్‌ రీ సైక్లింగ్‌ టోకరా! | Ration Rice Illegal Business Nellore | Sakshi
Sakshi News home page

రేషన్‌ రీ సైక్లింగ్‌ టోకరా!

Published Thu, Jun 20 2019 9:51 AM | Last Updated on Thu, Jun 20 2019 9:52 AM

Ration Rice Illegal Business Nellore - Sakshi

పేదలు కడుపు నింపాల్సిన రేషన్‌ బియ్యం డీలర్ల నుంచి దళారులు, మిల్లర్లు, వ్యాపారుల జేబులు నింపుతోంది. రేషన్‌ బియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేస్తూ ఏటా కోట్లాది రూపాయిలు దోచుకుంటున్నారు. ప్రజలకు చేరాల్సిన బియ్యం దొడ్డిదారిలో మిల్లులకు చేర్చి అక్కడ పాలిష్‌ పట్టించి వివిధ రకాల బ్రాండ్ల పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. పీడీఎస్‌ బియ్యాన్నే పాలిష్‌ పెట్టి సీఎంఆర్‌కు సరఫరా చేస్తూ ప్రభుత్వానికే టోకరా వేస్తున్నారు. అధికార యంత్రాంగం సహకారంతో జరుగుతున్న ఈ అక్రమ దందాకు జిల్లా వేదికగా మారింది. 

సాక్షి, నెల్లూరు: జిల్లాలో నెల్లూరు రూరల్, కావలి పరిధిలో దాదాపు 35 రైస్‌ మిల్లులు ఉన్నాయి. జాతీయ రహదారికి సమీపంలో రైస్‌ మిల్లులు ఉండడంతో కొన్ని మిల్లుల యజమానులు రేషన్‌ బియ్యం సేకరించి రహస్యంగా మిల్లుల్లో నిల్వ చేసి రీసైక్లింగ్‌ చేస్తున్నారు. రెండు దశాబ్దాల కాలంగా పీడీఎస్‌ బియ్యం రీసైక్లింగ్‌ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఏదైనా సరే రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకోవడం, అధికారులతో లాలూచీ పెట్టుకొని పేదల బియ్యాన్ని పాలిష్‌ పెట్టి వివిధ రకాల బ్రాండ్ల పేరిట మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. రీసైక్లింగ్‌ చేసిన బియ్యాన్ని పాత బియ్యం పేరుతో మార్కెట్‌లో రూ.45 నుంచి రూ.55 వంతున విక్రయాలు చేస్తున్నారు. మరి కొందరు పాలిష్‌ పెట్టిన బియ్యాన్ని జాక్‌పాట్‌ లారీల ద్వారా చెన్నైకు రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. 

ఇతర జిల్లాల్లో సేకరణ 
నెల్లూరు రూరల్‌ ప్రాంతంలోని అల్లీపురం, నవలాకుతోట, గుడిపల్లిపాడు, నరుకూరు, కొత్తకాలువ సెంటర్, సౌత్‌ రాజుపాళెం ప్రాంతాల్లో రైస్‌ మిల్లులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో దాదాపు 15 రైస్‌ మిల్లుల్లో రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ జరుగుతున్నట్లు సమాచారం. కావలి, జలదంకి ప్రాంతంలో ఉన్న రైస్‌ మిల్లుల్లో కూడా రీసైక్లింగ్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 9 లక్షలకు పైగా కార్డులు అండగా, అందులో లక్షకు పైగా బోగస్‌ కార్డులు ఉన్నట్లు సమాచారం. కొంత మంది డీలర్లు ఏఏవై కార్డులు సృష్టించారు. ఏఏవై కార్డులకు 35 కేజీల బియ్యం పంపిణీ చేస్తారు.

ఇలా ప్రతి నెల సుమారు 14 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం చౌకదుకాణాల ద్వారా కార్డు దారులకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 30 శాతం మంది కార్డుదారులు బియ్యం తీసుకోకుండా చౌక దుకాణం డీలర్లకు కేజీ రూ.6 చొప్పున విక్రయిస్తారు. జిల్లాలోని రేషన్‌ డీలర్ల నుంచి రైస్‌ మిల్లుల యజమానులు ఏర్పాటు చేసిన కొందరు దళారుల ద్వారా పీడీఎస్‌ బియ్యం సేకరిస్తున్నారు. డీలర్‌ దళారులకు కేజీ రూ.15 వంతున విక్రయాలు చేస్తున్నారు.

జిల్లాలోని డీలర్ల నుంచి నెలవారీగా సేకరణలో పాటు ఎంఎల్‌ఎస్, పాయింట్ల వద్ద కూడా సిబ్బంది కక్కుర్తితో అక్కడ నుంచి కూడా బియ్యం సేకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా నెలవారీగా దాదాపు 4 వేల మెట్రిక్‌ టన్నుల వరకు దళారీ వ్యవస్థ ద్వారా రైస్‌ మిల్లులోకి వెళ్తున్నాయని సమాచారం. పీడీఎస్‌ బియ్యం సేకరణ నెల్లూరుకే పరిమితం చేయకుండా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల నుంచి కూడా అధికారుల సహకారంతో నెల్లూరుకు అక్రమ రవాణా సాగిస్తున్నట్లు సమాచారం. 

సీఎంఆర్‌కు రేషన్‌ బియ్యం 
పౌరసరఫరా శాఖ ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించి వాటిని మర ఆడించిన బియ్యాన్ని సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌)గా తిరిగి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ఇలా ఏటా జరిగే ప్రక్రియ అయితే పలువురు రైస్‌ మిల్లుల యజమానులు రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ పట్టి   సీఎంఆర్‌కు ఇస్తున్నట్లుగా విజిలెన్స్‌ అధికారుల విచారణలో తేలింది. వివిధ జిల్లా నుంచి రహస్యంగా సేకరించిన రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు సమాచారం.

బ్రాండ్ల పేరుతో ఎగుమతి 
పీడీఎస్‌ బియ్యాన్ని మూడు దఫాలుగా పాలిష్‌ పడుతారు. దీంతో ఆ బియ్యం సన్నాలుగా కనిపించేలా చేస్తారు. ఆ బియ్యాన్ని పలు రకాల బ్రాండ్‌ పేరుతో ఉన్న బ్యాగుల్లో నింపి రాత్రి వేళల్లో చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆ బియ్యాన్ని తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా జాక్‌పాట్‌ (బిల్లులు లేకుండా సరుకు తీసుకెళ్లే వాహనాలు) లారీల నుంచి చెన్నైకు తరలిస్తుంటారు. రెండు దశాబ్దాలుగా ప్రతి నిత్యం జాక్‌పాట్‌ లారీల ద్వారా  బియ్యం తరలిస్తున్నారు. జాక్‌పాట్‌ లారీలను హైవేపై ఏ శాఖ అధికారులు తనిఖీలు చేయకుండా నెలవారీగా మామూళ్లు కూడా ఇస్తుంటారు. ఇది  జగమెరిగిన సత్యమే. రీసైక్లింగ్‌ బియ్యం అధిక శాతం చెన్నైకు తరలిస్తుంటారు.  ప్రతి నెల సుమారు 60 లారీల బియ్యం చెన్నైకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. నెల్లూరు మొలగొలుకలు, సన్నాలకు జాతీయ స్థాయి మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడంతో ఆ బ్రాండ్‌ పేరుతో పీడీఎస్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

మాఫియాకు టీడీపీ నేతలు అండ 
టీడీపీ ఐదేళ్ల పాలనలో అక్రమాలకు పాల్పడే రైస్‌ మిల్లుల యజమానులకు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అండగా నిలిచారు. పేదల బియ్యాన్ని సేకరించి రీౖసైక్లింగ్‌ చేసి బ్రాండ్ల పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసే ప్రక్రియపై ఎలాంటి దాడులు జరగకుండా మాజీమంత్రి అండగా నిలవడంతో అక్రమ దందా ఐదేళ్ల కాలం యథేచ్ఛగా సాగింది. ప్రభుత్వం మారడంతోనే విజిలెన్స్‌ అధికారులకు స్వేచ్ఛ రావడంతో  పక్కా సమాచారంతో దాడులు చేస్తున్నారు. ఇటీవల అల్లీపురంలోని ఓ రైస్‌ మిల్లులో నిల్వ ఉంచిన 1,500 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement