చీరాల, న్యూస్‌లైన్: పేదలకందాల్సిన రేషన్‌బియ్యం డీలర్లు, మిల్లర్లు, అక్రమ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. పేదల బియ్యాన్ని వారు గద్దల్లా తన్నుకుపోతున్నారు. జిల్లాలో చీరాల కేంద్రంగా పెద్ద ఎత్తున రేషన్‌బియ్యం ఇతర జిల్లాలకు తరలిపోతోంది. మూడు నెలల క్రితం వరుసగా రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు దాడులు చేసి అక్రమ రవాణాను అరికట్టి పలువురు వ్యాపారులు, డీలర్లపై కేసులు పెట్టారు. దీంతో మూడు నెలలుగా రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం కొంత మేర తగ్గింది. ఏమైందో ఏమో కానీ రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం రేషన్ బియ్యం అక్రమ రవాణా జోలికి వెళ్లకపోవడంతో మళ్లీ పాత వ్యాపారులంతా రంగంలోకి దిగారు. ప్రాంతాల వారీగా రేషన్ డిపోలను పంచుకొని పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు.చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తరలిపోతోంది. మోటుపల్లి గ్రామానికి చెందిన ఒక అక్రమ వ్యాపారి అధికార పార్టీ అండదండలతో వేటపాలెం, చినగంజాం మండలాల్లో డీలర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి గుంటూరు జిల్లా బాపట్లకు తరలిస్తున్నాడు.
కొద్ది రోజుల క్రితం ఇతనికి సంబంధించిన ఒక లారీని పట్టుకొనేందుకు ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ ప్రయత్నించగా అతనిపై దాడికి ప్రయత్నించి లారీని తీసుకెళ్లాడు. అధికారులను సైతం బెదిరించే స్థాయికి వెళ్లాడు. అతనిపై పలు 6ఏ కేసులు నమోదు చేసినప్పటికీ అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ఏ అధికారీ ధైర్యం చేయడం లేదు. చీరాల రూరల్ గ్రామాల్లో మళ్లీ పాత వ్యాపారస్తులే రంగంలోకి దిగి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. వీరిపై డజన్ల సంఖ్యలో కేసులున్నాయి. ఇప్పటికీ వీరికి చెందిన పలు వాహనాలు పోలీస్‌స్టేషన్లలోనే ఉన్నాయి. అయినప్పటికీ అక్రమ వ్యాపారం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో పీడీ యాక్ట్ పెట్టినా వీరు వ్యాపారం మానుకోవడం లేదు. పేరాలకు చెందిన ఓ వ్యక్తి కొద్ది నెలల క్రితం ఈ అక్రమ వ్యాపారంలోకి అడుగు పెట్టి కర్లపాలెంలో ఒక భవనాన్ని కట్టాడు. అలానే మరికొందరు కొత్తగా ఈ అక్రమ వ్యాపారంలోకి అడుగు పెట్టారు.
పార్శిల్ వాహనాల ద్వారా....
గతంలో లారీలు, ఆటోల ద్వారా తెల్లవారుజామున రేషన్ బియ్యాన్ని తరలించేవారు. అయితే వరుసగా రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడులు చేయడంతో కొద్ది రోజుల పాటు మౌనంగా ఉన్న వ్యాపారులు ప్రస్తుతం పార్శిల్ సర్వీస్‌కు సంబంధించిన వాహనాల్లో వేరే బస్తాల్లోకి రేషన్ బియ్యాన్ని మార్చి తరలిస్తున్నారు. చీరాలలో పలు పార్శిల్ వాహనాల్లో రేషన్ బియ్యం గుంటూరుతో పాటు ఇతర జిల్లాలకు తరలి వెళ్తున్నాయి. అలానే స్వర్ణ, కారంచేడు, పర్చూరు మీదుగా రూటు మార్చి కొందరు బాపట్లకు చేరుస్తున్నారు. డీలర్లు కేటాయింపులు తక్కువగా వచ్చాయని కార్డుదారులకు మాయమాటలు చెప్పి వారికి బియ్యం బదులు కేజికి * 4 చొప్పున డబ్బులు ఇస్తున్నారు. వారు అక్రమ వ్యాపారులు, మిల్లర్లకు * 9 చొప్పున విక్రయిస్తున్నారు. అక్రమ వ్యాపారులు ఇతర జిల్లాలకు బియ్యాన్ని తరలించి అక్కడి మిల్లర్లకు * 12 నుంచి * 15 వరకు అమ్ముకుంటున్నారు.
దాడులు నిలిపేసిన అధికారులు...
మూడు నెలల క్రితం వరుసగా దాడులు చేసి అక్రమ రేషన్ వ్యాపారాన్ని కొంత మేర అరికట్టిన అధికారులు ప్రస్తుతం పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తరలిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఇటీవల రేషన్ షాపులపై పర్యవేక్షణ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఓ అధికారి పూర్తి స్థాయిలో రేషన్ డీలర్లు, అక్రమ వ్యాపారులకు సహకరిస్తూ దాడులు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూటు మార్చిన కేటుగాళ్లు
Published Sat, Aug 10 2013 4:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement