రాష్ట్ర విభజన రాయలసీమను తీవ్ర సంక్షోభంలోకి నెడుతుందని, ముఖ్యంగా నీటి సమస్య తీవ్రరూపం దాలుస్తుందన్న విషయంలో ఆంటోనీ కమిటీకి నివేదించి తద్వారా రాయల తెలంగాణ ప్రతిపాదనను పరిశీలించాలని కాంగ్రెస్‌కు చెందిన కర్నూలు, అనంతపురం నేతలు కోరనున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన రాయలసీమను తీవ్ర సంక్షోభంలోకి నెడుతుందని, ముఖ్యంగా నీటి సమస్య తీవ్రరూపం దాలుస్తుందన్న విషయంలో ఆంటోనీ కమిటీకి నివేదించి తద్వారా రాయల తెలంగాణ ప్రతిపాదనను పరిశీలించాలని కాంగ్రెస్‌కు చెందిన కర్నూలు, అనంతపురం నేతలు కోరనున్నారు. ఇందుకు సంబంధించిన గణాంకాలనూ సిద్ధం చేసుకుంటున్నారు. శుక్రవారమిక్కడ మంత్రులు సాకే శైలజానాథ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఏరాసు ప్రతాప్‌రెడ్డి తనతోపాటు నీటిపారుదల రంగ నిపుణుల్ని కూడా తీసుకొచ్చారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించినా, విభజన ద్వారా తలెత్తే సమస్యలను ఏకరువుపెడుతూ తమ పరిస్థితి దృష్ట్యా తెలంగాణతోనే కలసి ఉంటామని కమిటీ ఎదుట చెప్పాలన్న నేతలు అభిప్రాయానికి వచ్చారు.
రాయలసీమ అత్యధిక శాతం పోతిరెడ్డిపాడు ద్వారా వచ్చే కృష్ణా జలాలపైనే ఆధారపడి ఉందని, రాష్ట్ర విభజనతో అక్కడినుంచి నీటి విడుదలలో చాలా సమస్యలు తలెత్తుతాయని, నీటి పంపకాల్లో తమకు న్యాయం జరగదని ఆందోళన వ్యక్తంచేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో నిర్ణీత పరిధి మేరకు నీటిని నిలువ ఉంచడం ద్వారానే శ్రీశైలం బ్యాక్ వాటర్ పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు అందుతుందని పేర్కొన్నారు. విద్యుదుత్పత్తికోసం నిర్ణీత ఎత్తులో నిలవ ఉంచకుండా నీటిని కిందికి వదిలేస్తే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు అందదని.. ఫలితంగా తాగు, సాగునీటికి కటకటలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమైంది. నికరజలాలు కేటాయింపులేని ప్రాజెక్టుల పరిస్థితి మరింత అయోమయంలో పడతాయని నేతలు అంచనాకు వచ్చారు. ఈ అంశాలన్నిటిపై నీటిపారుదల నిపుణుల నుంచి సమాచారాన్ని కూడా తీసుకున్నారు. ఆంటోనీ కమిటీ ముందు వీటన్నింటినీ వివరించాలని నిర్ణయించారు.