సిండికేట్ల చేతికి ఇసుక రేవులు
Published Thu, Dec 12 2013 4:44 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి ప్రతినిధి, గుంటూరు :జిల్లాలో బుధవారం జరిగిన ఇసుక రీచ్‌లకు పాటదారులు వేరైనా చివరకు సిండికేట్లు ఏకమై రేవుల్లో వ్యాపారం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ప్రజలకు తక్కువ ధరకు ఇసుకను అందించాలనే మంచి ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం లాటరీ విధానంలో ఇసుక రీచ్‌లను కేటాయించింది. క్యూబిక్ మీటరు రూ.450 లకు మించి అమ్మరాదనే నిబంధన విధించింది. ఇది కచ్చితంగా అమలైతే ఆరు క్యూబిక్ మీటర్ల లారీ ఇసుక రూ.2600 లకు రేవు వద్ద లభిస్తుంది. లారీ కిరాయి అదనంగా ఉంటుంది. మొత్తం మీద లారీ ఇసుక రూ.7 వేల నుంచి 8 వేలలోపు లభిస్తుంది. ప్రస్తుతం లారీ ధర రూ.12 వేలకుపైగానే ఉంది.
జిల్లా యంత్రాంగం ఇసుక ధరను నియంత్రిస్తేనే లాటరీ విధానం సక్రమంగా అమలులోకి వచ్చినట్టుగా పేర్కొనవచ్చు. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల ఇసుక వ్యాపారులు అధికారుల ప్రయత్నాలకు ప్రారంభంలోనే గండికొట్టారు. టెండరు తేదీకి రెండు రోజులు ముందుగానే సమావేశమై లాటరీ విధానాన్ని అపహాస్యం చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. తమతో ఏకాభిప్రాయానికి వచ్చిన వ్యాపారులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేశారు. వారితో దరఖాస్తు తీయించారు. టెండరు రోజు దరఖాస్తుతో కట్టాల్సిన ఈఎండిని తీయించారు. వీరందరూ విడివిడిగా దరఖాస్తులు ఇచ్చారు. ఈ గ్రూపులో ఎవరికి లాటరీ తగిలినా అంతా కలిసి ఇసుక వ్యాపారం చేసే విధంగా అంగీకారానికి వచ్చి అందులో విజయం సాధించారు.
సిండికేట్ల తంత్రం
జిల్లాలో నాలుగు రీచ్‌లకు పిలిచిన టెండర్లలో తాడేపల్లి రీచ్‌కు 182 దరఖాస్తులు వచ్చాయి.లాటరీ తీయగా గుడే మూర్తయ్య అనే వ్యాపారికి రీచ్ లభించింది. అమరావతి మండలం మల్లాది రీచ్‌కు 153 దరఖాస్తులు రాగా లాటరీలో రాజకోటయ్యకు,. కొత్తపల్లి-చింతపల్లి ఇసుక రీచ్‌కు 210 దరఖాస్తులు అందగా 9 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 201 దరఖాస్తులకు లాటరీ తీయగా తెనాలికి చెందిన ఆకుల సురేంద్రకుమార్‌కు రీచ్ లభించింది. రికార్డుల ప్రకారం ఇదీ అంతా సవ్యంగానే కనపడుతుంది.అయితే రెండు రీచ్‌లకు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడినట్టు వ్యాపార వర్గాల కథనం. ఒక్కో సిండికేట్‌లో 60 మంది సభ్యులు న్నారు. ఒకొక్కరు రూ.5 వేలు చెల్లించి (తిరిగి చెల్లించరు) దరఖాస్తు తీసుకున్నారు. దరఖాస్తుతోపాటు రూ.10 లక్షల వరకు ఈఎండి కట్టారు. ఈ 60 మంది సిండికేట్‌లోని ఒకరికి లాటరీలో రీచ్ లభించింది. ఆ వ్యాపారి పేరు మీద 60 మంది ఇసుక వ్యాపారం చేసుకోనున్నారు. ఈ సిండికేట్ వ్యవహారంపై డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ ఢిల్లీరావును వివరణ కోరగా, కార్యాలయం బయట జరిగిన విషయాలు తమకు సంబంధం లేదన్నారు. అయితే జిల్లా యంత్రాంగం నిర్ణయించిన ధరకు మించి ఇసుక అమ్మకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇసుక ధర నియంత్రణ సాధ్యమేనా?
జిల్లా అధికారులు ఇసుక ధరను నియంత్రిస్తామని చెబుతున్నారు. అయితే సిండికేట్లు టెండరు దక్కించుకోడానికి చేసిన ఖర్చును పరిశీలిస్తే ఇది సాధ్యమేనా అనే సందేహాలు కలగక మానవు. ఒక గ్రూపు 60 దరఖాస్తులు తీసుకున్నది. ఒక్కో దరఖాస్తుకు రూ.5 వేల చొప్పున రూ.3 లక్షలు ఖర్చుచేసింది. రీచ్ లభించిన వ్యాపారి మినహా మిగిలిన దరఖాస్తులకు ఇచ్చిన రూ.2.95 లక్షలు తిరిగి వెళ్లవు. అదే విధంగా ఒక్కొక్కరు రూ.10 లక్షల వరకు ఈఎండి తీసుకున్నారు. టెండరు లభించని వ్యాపారి ఆ డిడిని రద్దు చేసుకోడానికి కనీసం రూ.3 వేల ఖర్చు చేయాల్సి ఉంటుంది. 59 మంది వ్యాపారులకు కలిపి రూ.1.77 లక్షలు ఖర్చులు అవుతాయి. వీటన్నింటినీ భరించిన సిండికేట్ అధికారులు నిర్ణయించిన ధరకు ఇసుక అమ్ముతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే! మరి జిల్లా యంత్రాంగం ఏం చేస్తుందో చూడాలి మరి.!
Advertisement
Advertisement