పాలకొండలోని గారమ్మ కాలనీకి చెందిన వితంతువు కోనారి సరస్వతమ్మ ప్రభుత్వమిచ్చిన సెంటు స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని ఏడాది కిందట తలపెట్టింది. నిర్మాణం జరపకపోతే రద్దు చేస్తామని అధికారులు ఆదేశించడంతో అప్పు చేసి పునాదులేసింది. ఇందిరమ్మ ఇల్లు బిల్లులు మంజూరు కాకపోవడంతో సొంతంగానైనా గూడు నిర్మించుకోవాలని ఆరాట పడింది. అప్పు చేసి పునాదులు నిర్మిస్తున్న సమయంలో ఇసుక ధరలు రెట్టింపు కావడంతో నిర్మాణాన్ని నిలిపేసి వలస బాట పట్టింది.
పాలకొండకు చెందిన ఓ ఉపాధ్యాయుడు వేసవి సెలవుల్లో ఇల్లు నిర్మించుకోవాలనుకున్నారు. సిమెంట్, ఇనుము ధరలతోపాటు ఇసుకకు కూడా రెట్టింపు ధర చెల్లించాల్సి ఉన్నా ప్రత్యామ్నాయ మార్గం లేక ఆ మేరకు ప్రణాళిక తయారు చేసుకున్నారు. అన్నీ సిద్ధం చేసుకున్న తరువాత ఎంత ధర చెల్లించినా.. ఇసుక దొరకని పరిస్థితి. దీంతో నిర్మాణానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పారు.
జిల్లాలో ప్రస్తుతం సొంత గూడు నిర్మించుకోవాలనుకున్న వారికి ఎదురౌతున్న ఇసుక కష్టాలకు ఇవి తార్కాణం. ఇది ఏ ఒకరిద్దరి సమస్య కాదు ఇది. జిల్లా అంతటా గృహ నిర్మాణదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.
పాలకొండ : నూతన ఇసుక విధానంతో ఖజాన నింపుకోవడమే ప్రధాన ధ్యేయంగా జిల్లాలో 28 ర్యాంపులను ప్రభుత్వం ప్రారంభించింది. వీటి పరిధిలో 20,82,253 క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయించేందుకు సిద్ధం చేసింది. ఇందులో ఇంత వరకు 7,40,182 క్యూబిక్ మీటర్ల ఇసుకను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.42,42,36,012 ఆదాయం సమకూరింది. ఇంత వరకు విక్రయించిన ఎనిమిది ర్యాంపుల్లో పూర్తిగా ఇసుకను తోడేశారు. మిగిలిన 20 ర్యాంపుల్లో పది వివాదాల్లో చిక్కుకున్నాయి. గ్రామ పంచాయతీలకు ముంపు వాటిల్లేవిగా ఉండటం, అధికార పార్టీ నాయకులు హవా, కోర్టు వివాదాలతో ఇలా పది ర్యాంపులు నిలిచిపోవడంతో ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రధానంగా వంశధార నదీతీరంలో ఉన్న ఆకులతంపర, సింగూరు, తమరాం, గోపాలపెంట తదితర ఇసుక ర్యాంపుల నుంచి లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను విక్రయించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడింది.
కొనసాగుతున్నవి ఐదే
జిల్లాలో ప్రస్తుతం ఐదు ఇసుక ర్యాంపులే కొనసాగుతున్నాయి. క.ఖాండ్యం, ముద్దాడపేట, పర్లాం, పొన్నాడ, బుచ్చిపేట ర్యాంపులు ప్రస్తుతం పని చేస్తున్నాయి. వీటిలో కూడా ఇసుక నిల్వలు దాదాపు 80 శాతం పూర్తికావచ్చాయి. మరో పది, పదిహేను రోజుల్లో ఇసుక ర్యాంపుల లక్ష్యాలు పూర్తి కానున్నాయి. దీంతో కొత్త ర్యాంపులు ఏర్పాటయ్యే వరకు జిల్లాలో ఇసుకకు తీవ్రత కొరత తప్పేటట్టు లేదు.
ఇతర ప్రాంతాలకు తరలిన ఇసుక
ఇంతవరకు జిల్లా నుంచి విక్రయించిన ఇసుకలో 80 శాతం ఇతర ప్రాంతాలకే తరలిపోయింది. జిల్లా వాసులకు కేవలం 20 శాతం కూడా చేరలేదు. అందుబాటులో ర్యాంపులు లేకపోవడంతో గృహ నిర్మాణదారులకు ఇసుక ఇబ్బందులు తప్పటం లేదు. ట్రాక్టర్ ఇసుక కోసం రూ.3,500 చెల్లిస్తే రవాణా ఖర్చులకు మరో రూ. 3,500 చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఇళ్లు నిర్మాణాలు 90 శాతం మేర తగ్గాయి.
పెరుగుతున్న వలసలు !
జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో కూలీలగా పని చేస్తున్న వారు సుమారు ఆరు లక్షల మంది ఉన్నారు. ఇసుక కొరతతో నిర్మాణాలు నిలిచిపోయిన కారణంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులంతా గుంటూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం తదితర నగరాలకు వలస బాట పడుతున్నారు. రోజూ వందలాది మంది బతుకు తెరువు కోసం వలస వెళ్తున్నారు.
నిండుకున్న ఇసుక !
Published Fri, Jun 19 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM
Advertisement
Advertisement