ఇళ్లకు ఫొటోలు, మనుషులకు బయోమెట్రిక్ వేలిముద్రలు
కొత్త ఇంటి నంబర్లు, కంటిపాపల నమోదు
ఆధార్ లేని వారికి వెంటనే మంజూరు
బొండపల్లి, విజయనగరంలో నేటినుంచి శాంపిల్ సర్వే
విజయనగరం కంటోన్మెంట్: మీ ఇంట్లో ఐదేళ్ల లోపున్న పిల్లలకు ఆధార్ నంబర్ లేదా? మీ ఇంట్లో ఇంకెవరికయినా బ్యాం కు అకౌంట్ లేదా?? అయితే నిశ్చింతగా ఉండొచ్చు. ప్రభుత్వం మంగళవారం నుంచి స్మార్ట్‌పల్స్ సర్వే ప్రారంభించనుంది. జూలై 6 నుంచి జరగనున్న సర్వేకు పైలట్‌గా జిల్లాలోని బొండపల్లి మండలంలోని ఓ గ్రామం, విజయనగరంలోని ఓ వార్డులో మంగళవారంనుంచి మొదలవుతుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
ప్రత్యేక బృందాలు ఇందుకోసం ఇళ్లనూ సందర్శించి మొత్తం 75 రకాల అంశాలపై సర్వే చేపడతాయి. ఇందుకోసం 31 బ్లాకులుగా విభజించి వాటికి 31 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. ఈ సందర్భంగా సర్వేలో బ్యాంక్ అకౌంట్ లేని వారిని గుర్తిస్తే వారికి వెంటనే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసేందుకు, ఐదేళ్ల లోపున్న వారికి ఆధార్ సంఖ్య లేకపోతే కొత్తగా నంబర్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రతి పదిమంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించారు. ఈ పైలట్ సర్వే ఈ నెల 30 వరకూ ఉంటుంది.
సర్వే వాస్తవాలను తెలియజేస్తుందా?
జిల్లాలో ఈ నెల 28 నుంచి చేపట్టనున్న స్మార్ట్ పల్స్ సర్వే కార్యక్రమంంలో వాస్తవమయిన సర్వేను చేపడతారా అన్నదానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో పలు సర్వేలు చేపట్టినప్పటికీ ఒకే ఇంటి వద్ద కూచుని లేదా సర్పంచ్‌లు, ఎంపీటీసీల ఇళ్ల వద్ద కూచుని తెలిసిన వివరాలను రాసేసి వెళ్లిపోయేవారు. ఇప్పుడు కూడా ఇలానే ఉంటుందా లేక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సక్రమంగా చేపడతారా అన్నది తేలాల్సి ఉంది. దీనిపై ప్రజల్లో ఇంకా చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సౌకర్యాలపై ఆరా...
ఈ సర్వేలో ప్రజలకు ఎటువంటి సౌకర్యాలున్నాయి? ఏయే సౌకర్యాలు లేవు. అత్యవసరంగా కావాల్సినవేమిటన్న అంశాలను పొందుపరుస్తారు. జిల్లాలోని అన్ని కుటుంబాల వివరాలనూ ట్యాబ్‌లలో బంధిస్తారు. వీటిని ఇంటర్నెట్‌కు అనుసంధానం చేస్తారు. దీని వల్ల భవిష్యత్తులో ప్రతీ కుటుంబ ఆర్థిక, సామాజిక స్థితిగతులన్నీ తెలుస్తాయి. ప్రస్తుతం జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలకు సంబంధించి వివిధ స్థాయిల్లో కుటుంబాల వివరాలున్నాయి. ఆయా వివరాలతో కలగలిపిన నూతన సర్వే అంశాలను పొందుపరచి వీటిని సిద్ధం చేస్తారు. భవిష్యత్తులో ఏవైనా పథకాలు ప్రవేశపెడితే... వాటికి ఎవరు అర్హులో ఎవరు అనర్హులో తెలియజేసేందుకు, ఈ వివరాలు ఉపయోగపడతాయి. ఇందుకోసం కలెక్టరేట్‌లో ఇంటర్నెట్, కంప్యూటర్ల విధానాన్ని అమర్చుతున్నారు.
స్మార్ట్ సర్వేకు సన్నద్ధం
Published Tue, Jun 28 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM
Advertisement