ఎర్ర చందనం దుంగలను పరిశీలిస్తున్న ఎస్పీ అమ్మిరెడ్డి
సాక్షి, కోటబొమ్మాళి: కొంతకాలం క్రితం మెళియాపుట్టి మండలంలో ఎర్రచందనం దుంగలు దొరికాయి.. దిల్లీకి చెందిన ఒక ముఠా వీటిని రైలు మార్గంలో తరలించేందుకు అనువైన ప్రదేశంలో ఉంచినట్టు పోలీసులు గుర్తించారు.. తాజాగా కోటబొమ్మాళి మండలం రేగులపాడు పంచా యతీ పరిధిలో జమ్ము క్వారీని ఆనుకొని ఉన్న కొండ పక్క భారీ సంఖ్యలో ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు.. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఈ దుంగలను ఉంచడం చూస్తుంటే.. గప్‌చుప్‌గా తరలించేందుకు ఏదో ఒక ముఠా పథకం పన్నిందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ ముఠాల గుట్టు రట్టు చేస్తామని ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి చెప్పారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్థానిక ఎస్సై ఎస్.లక్ష్మణరావు హుటాహుటిన ఆ స్థలానికి వెళ్లి అక్కడ ఉన్న 120 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుందని అంచనా వేశారు. కొన్ని సంవత్సరాల క్రితం జమ్ము గ్రానైట్ కంపెనీ ఎర్ర చందనం మొక్కలను నాటినట్లు స్థానికులు చెబుతున్నారు. క్రమేపీ మొక్కలు పెద్దవవ్వడంతో కొంతమంది వ్యక్తులు వాటిని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ అమ్మిరెడ్డి బుధవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న దుంగలను పరిశీలించారు. ఈ ఘటనల వెనుక సూత్రధారులు ఎవరన్న విషయంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో..
రేగులపాడుకు చెందిన గొలివి హరి అనే ట్రాక్టర్ డైవర్ ఎర్రచందనం దుంగలను లోడు చేస్తుండగా కొంతమంది గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోటబొమ్మాళి ఎస్‌ఐ ఎస్.లక్ష్మణరావు హుటాహుటిన ఆ స్థలానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ అవి ఎర్రచందనం దుంగలని తనకు తెలియదని, వంట చెరుకు తెమ్మని చెప్పగా వెళ్లానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. విశ్వనాథపురం సమీపంలో గల జమ్ములో గ్రానైట్ సంస్థ 10 సంవత్సరాల క్రితం నాటిన చందనం మొక్కలను ప్రస్తుతం విక్రయించవల్సిందిగా సంబంధిత మెనేజ్‌మెంట్ చెప్పగా ఆమేరకు వాటిని విక్రయించేందుకు సిద్ధమైనట్లు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఆర్.ఉమామహేశ్వరరావు తెలియజేసినట్లు పోలీసులు చెప్పారు.
ఈ విషయంపై శ్రీకాకుళం అటవీశాఖలో పనిచేస్తున్న చల్ల శ్రీనివాసరావును పోలీసులు విచారించగా అవి అటవీశాఖ పరిధిలోవి కావని తేల్చినట్లు తెలిసింది. ఎస్పీ అమ్మిరెడ్డి, డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐలు నీలయ్య, రమణతోపాటు స్థానిక పోలీసులు రేగులపాడు, విశ్వనాథపురం గ్రామాల్లో పర్యటించి విచారణ చేపట్టారు. ఈ విషయంపై స్థానిక ఎస్సై లక్షణరావు మాట్లాడుతూ.. అనుమానితులను రప్పించి విచారణ చేస్తున్నామని, మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయి సమాచారం వస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment