అనర్హులను తొలగించండి
అనంతపురం రూరల్:
‘మా ఊళ్లో సర్వే సరిగా చేయలేదు.. కొన్నేళ్లుగా కొందరు అనర్హులు వృద్ధాప్య, వికలాంగ పింఛన్లు తీసుకుంటున్నారు.. వారందరినీ తొలగించండి’ అని టీడీపీ నేతలు మంత్రి పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రూ 3 వేలకు వికలాంగల సర్టిఫికెట్లను అందజేస్తున్నారన్నారు. బొటన వేలు పోయిన వాళ్లు, చేతికి గీత పడినవారు కూడా సర్టిఫికెట్లతో హాజరవుతున్నారని మంత్రికి వివరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు మండలాల స్పెషలాఫీసర్లు, ఎంపీడీఓలు, పింఛన్ల కమిటీలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఓబులేసు, నారాయణస్వామి, ప్రసాద్, తదితరు మాట్లాడుతూ పింఛన్ల జాబితాలో ఇంకా అనర్హులున్నారని, వారిని ఎందుకు తీసివేయలేదని అధికారులను ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సర్వే కమిటీలో మీరూ ఉన్నారు కదా? అప్పుడెందుకు స్పందించలేదని ప్రశ్నించడంతో వారు సమాధాన చెప్పలేకపోయారు. మంత్రి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో అర్హులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కమిటీలను వేసిందన్నారు. అక్టోబర్ 2 నుంచి పింఛన్లను మంజూరు చేస్తున్నామన్నారు. జిల్లాలో పింఛన్లకు రూ. 40 కోట్ల నుంచి రూ.50 కోట్ల దాకా ఖర్చు అవుతందని తెలిపారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాల్సిందిపోయి కమిటీ సరిగా లేదు.. అనర్హులున్నారని తెలపడం సరికాదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
అధికారుల ప్రవర్తనపై మంత్రి ఆగ్రహం
మంత్రి సునీత సమావేశం నిర్వహిస్తుండగా రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్, స్పెషాలాఫీసర్ నారాయణస్వామి, జెడ్పీటీసీ వేణుగోపాల్ పదే పదే ముచ్చటిస్తూ, ఫోన్లలో మాట్లాడుతూ కార్యక్రమానికి అంతరాయం కల్పించారు. ఓ వైపు తెలుగు తమ్ముళ్లు విసుగు తెప్పిస్తుండగా, మరోవైపు స్టేజ్‌పై ఉన్నవారు అంతరాయం కల్గించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేనేమైనా పనిలేకుండా వచ్చానా?.. ఏదైనా పని ఉంటే బయటికెళ్లండి అంటూ ఆదేశించారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. కార్యక్రమంలో అనంతపురము ఎంపీపీ కన్నేగంటి మాధవి, వైఎస్ ఎంపీపీ శిల్ప, టీడీపీ నేత చంటి, ఎంపీడీఓ లక్ష్మినరసింహ శర్మ, ఆత్మకూరు, రామగిరి, సీకేపల్లి, రాప్తాడు, కనగానిపల్లి ఎంపీడీఓలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
రాప్తాడు నియోజకవర్గంలో 2033 పింఛన్ల తొలగింపు
రాప్తాడు నియోజవర్గంలోని ఆరు మండలాల్లో 30,505 పింఛన్లు ఉండగా, ఇందులో 2033 మందిని అనర్హులుగా తేల్చామని పీడీ నీలకంఠారెడ్డి తెలిపారు. పారదర్శకంగా సర్వే నిర్వహించామని, అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.