అధికార టీడీపీ పక్షంలో గుబులు పట్టుకుంది. దొంగ ఓట్ల గుట్టు రట్టు అవుతుండటంతో పార్టీ నాయకుల్లో ఆందోళన నెలకొంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా అంతర్గత చర్చలో ఈ కేసులు ఎవరిని ముంచుతాయోననే చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. జిల్లాలో సుమారు 50వేల ఓట్ల తొలగింపునకు ఫారం–7 దరఖాస్తులు సమర్పించిన నేపథ్యంలో ఇది చర్చనీయాంశమైంది. దీనిపై ఫిర్యాదులు అందుతున్నాయి.
సాక్షాత్తూ ఆర్డీఓనే రంగంలోకి దిగి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాల్సి వచ్చింది. వైఎస్సార్‌సీపీకి చెందిన సానుభూతిపరుల ఓట్లను తొలగించాల్సిందిగా అదేపార్టీ వారు దరఖాస్తు చేసినట్లు టీడీపీ వారు దొంగ నాటకానికి తెరతీసిన వైనం తెలిసిందే. ఇది ఇప్పుడు అధికారులకు కూడా పెద్ద తలనొప్పిగా తయారైంది. వేలకొద్దీ వచ్చి పడిన దరఖాస్తులను విచారించడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఈ దరఖాస్తులను మొక్కుబడిగా విచారిస్తున్నట్లు తెలిసింది. విచారణకు వెళ్తున్న బీఎల్‌ఓలకు ముచ్చెమటలు పడుతున్నట్లు భోగట్టా.
బద్వేలు/కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో ఓట్ల తొలగింపునకు వచ్చిన ఫారం–7 దరఖాస్తులపై విచారణ తూతూమంత్రంగా నడుస్తోంది. ఎన్నికల వేళ అధికార పార్టీ కుట్ర పన్ని వేల దరఖాస్తులు సమర్పించిందనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి బలం చేకూరుస్తూ సేవామిత్ర యాప్ తయారు చేసిన బ్లూఫ్రాగ్, దాని నుంచి ఓటర్ల వ్యక్తిగత సమాచారం అందుకున్న ఐటీగ్రిడ్స్‌కు టీడీపీకి ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా వెల్లడయ్యాయి.
ఈ నేపథ్యంలో తప్పుడు దరఖాస్తులను అన్‌లైన్‌లో సమర్పించడం సైబర్ నేరం కింద వస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని ప్రయివేట్ సంస్థలకు అప్పగించడం కూడా పెద్ద నేరమని సైబర్ నిపుణులు చెబుతున్నా ఆ దిశగా అధికారులు మాత్రం స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం కమలాపురం నియోజకవర్గంలో మాత్రమే ఆర్డీఓ ఫిర్యాదు చేయగా మిగిలిన ప్రాంతాల్లో అధికారులు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వాన్ని మోసం చేసేలా తప్పుడు పేర్లతో ఫారం–7 అందించి ఓట్లను తొలగించాలని కోరారు. ఇది ప్రభుత్వాన్ని మోసం చేయడమే. దీంతో పాటు ఓటర్ల డేటాను ఎలా సంపాదించారనే విషయాన్ని కూడా వారు తెలుసుకోవాల్సి ఉంది. అధికారులు మాత్రం ఈ దిశగా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. కేవలం గ్రామాల్లో తూతూమంత్రంగా విచారిస్తున్నారు. దీనిపై పలు చోట్ల ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాము దరఖాస్తు చేయనప్పుడు, దరఖాస్తు చేశారని చెబుతున్న వ్యక్తులు దానికి సంబంధం లేదని చెబుతున్నప్పుడు విచారణ ఎందుకని బీఎల్‌ఓలను నిలదీస్తున్నారు.
బలవుతున్న బీఎల్‌ఓలు
ప్రస్తుతం ఈ దరఖాస్తులను నాలుగైదు రోజుల్లో విచారించాలని ఉన్నతాధికారులు బూత్‌లెవెల్ అధికారుల(బీఎల్‌ఓ)కు ఆదేశాలు జారీ చేశారు. వారు ఆదివారం, శివరాత్రి పండుగ కూడా జరుపుకోకుండా గ్రామాల్లో పడి దరఖాస్తులను విచారిస్తున్నారు. ఒక్కో ఓటు తొలగింపు ఫారానికి మూడు ఫారాలు తయారు చేసి ఓటు తొలగింపు చేసిన వ్యక్తి, ఓటు తొలగింపు వ్యక్తితో సంతకాలు చేయించుకుంటున్నారు. చాలామంది ఓటర్లు అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో వారి ఓట్లు పరిస్థితి ఏమిటో తెలియడం లేదనే ఆందోళన నెలకొంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ నేతలు గెలిచేందుకు అడ్డదారులను తొక్కుతున్నారు. ఇప్పటికే ఆరు నెలల కిందట భారీగా ఓట్లు తొలగించేలా ఒత్తిడి తెచ్చి సఫలీకృతమయ్యారు. జాబితాలో పేరు లేని ఓటర్లు మళ్లీ దరఖాస్తు చేసుకుని ఓటు పొందారు. దీంతో మరో దఫా అన్‌లైన్లో ఫారం–7 సమర్పించారు. ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో బూత్‌లెవెల్ అధికారులపై వైఎస్సార్‌సీపీ మద్దుతుదారుల ఓట్లు తొలగించాలని ఒత్తిళ్లు తెలుస్తున్నట్లు సమాచారం.
చర్యలకు ఉపక్రమించిన జిల్లా యంత్రాంగం
ఆన్‌లైన్ ద్వారా తప్పుడు దరఖాస్తులు సమర్పిస్తున్న వారిపై జిల్లా యంత్రాంగం ఇప్పుడిప్పుడే కొరడా ఝుళిపిస్తోంది. పది మందిపై కేసుల నమోదు కోసం సైబర్ క్రైం సెల్‌కు ఫిర్యాదులు పంపారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి, కమలాపురంలో రెండు, పులివెందులలో రెండు, ప్రొద్దుటూరులో రెండు, బద్వేలులో ముగ్గురిపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులు పంపారు. ఇవన్నీ గుర్తు తెలియని వారిపై ఇచ్చిన ఫిర్యాదులే. పోలీసులు సర్వీసు ప్రొవైడర్ల ద్వారా ఐపీ అడ్రస్సు కనుగొంటారు. దీంతో ఏ కంప్యూటర్ నుంచి తప్పుడు దరఖాస్తులు వచ్చాయి, ఎవరు పంపారో తెలుసుకుని వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారు.
సైబర్ క్రైం, ఐపీసీ, ప్రజాప్రతినిద్య చట్టం 1951 సెక్షన్ల కింద కేసులు నమోదవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఓట్ల తొలగింపునకుఈనెల 1వ తేది నాటికి జిల్లావ్యాప్తంగా 37 వేల దరఖాస్తులు అందాయని అధికారులంటున్నారు. కానీ ఈ సంఖ్య 50వేల వరకూ ఉంటుందని వైఎస్సార్‌సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా అలజడితో ఫారం–7లు రావడం తగ్గాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.రఘునాథ్ సాక్షికి తెలిపారు.
జిల్లాలో నియోజకవర్గాలు: | 10 |
తుది జాబితా నాటికి ఓటర్లు: | 20,56,660 |
పోలింగ్ స్టేషన్లు: | 2,723 |
రిటర్నింగ్ అధికారులు: | 10 |
ఫారం–7 దరఖాస్తులు: | సుమారు 50వేలు |
ఆందోళన వద్దు
తప్పుడు దరఖాస్తులు ఇచ్చినంత మాత్రాన ఓట్లు తొలగిస్తారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఎన్నికల అధికారి హరికిరణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఫారం–7 వస్తే దాని ఆధారంగా బీఎల్‌ఓలు క్షేత్ర స్థాయి విచారణకు వెళతారు. తనకు రెండుచోట్ల ఓటు ఉందని, ఒకచోట తొలగించాలంటూ స్వయంగా ఓటరు సంతకంతో కూడిన దరఖాస్తు ఇస్తే తప్ప తొలగింపు సాధ్యపడదు. ఒక్కొ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 0.1 శాతం కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే మూడు దశల్లో విచారణ నిర్వహిస్తారు. అంటే జిల్లాలోని తుది ఓటర్ల జాబితా ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో 200కు మించి దరఖాస్తులు రావాల్సి ఉంటుంది. ఇందులో అర్హమైనవి ఉంటే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనుమతి తీసుకున్న తర్వాతే తొలగిస్తారని అధికారులు అంటున్నారు. అంటే ఓటర్లకు తెలియకుండా వారి ఓటును ఎవరూ తొలగించలేరని వారు స్పష్టం చేస్తున్నారు.
తొలగింపునకు వచ్చిన ఫారం-7 దరఖాస్తులు
ఫిర్యాదు చేయకపోవడంలోని ఆంతర్యమేమిటి!
బద్వేలు నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో దాదాపు 9600 ఓట్లు తొలగించాలని పారం–7 దరఖాస్తులు అందాయి. ఇవన్ని తప్పుడవని తేలినా ఒక్క మండలంలో కూడా పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేయకపోవడంలోని అంతర్యమేమిటో అర్ధం కావడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించేందుకు టీడీపీ ప్రభుత్వమే తప్పుడు విధానాల్లో దరఖాస్తు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తప్పుడు దరఖాస్తులపై కేసు నమోదు చేస్తే అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు వస్తాయనే భయమో... లేక ఇప్పటికే ఆదేశాలు వచ్చాయో అని ఓటర్లు చర్చించుకుంటున్నారు.
నా ఓటు తొలగింపు నేనే కోరుకుంటానా?
నా ఓటు పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలో ఉంది. నేనే వైఎస్సార్‌సీపీ యూత్ నాయకుడిని, బూత్ కన్వీనరును. అలాంటి పరిస్థితుల్లో నా ఓటు నేనే ఎందుకు తీసుకుంటా. నా పేరు మీద కొందరు తప్పుడు దరఖాస్తులు అందించారు. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లా. కానీ చర్యలు మాత్రం శూన్యం.
– గిరిప్రణిత్‌రెడ్డి, పోరుమామిళ్ల మండలం
కఠిన చర్యలు తీసుకోవాలి
ఇతరుల సమాచారాన్ని దొంగిలించి ఓట్ల తొలగింపునకు తప్పుడు దరఖాస్తులు ఇచ్చారు. ఇది సైబర్ నేరమే. అయినా అధికారులు, పోలీసులు పట్టనట్లు వ్యవహరించడం సరికాదు. బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– రవిచంద్రారెడ్డి, రజాసాహెబ్‌పేట, పోరుమామిళ్ల మండలం
ఇంటింటికి తిరిగి విచారిస్తున్నాం
ఓట్ల తొలగింపునకు వచ్చిన దరఖాస్తులను ఇంటింటి విచారణ చేస్తున్నాం. చాలా మంది అర్హులవే ఉన్నాయి. దీనికి తోడు తొలగించాలని పేర్కొంటున్న వ్యక్తులు సైతం తాము దరఖాస్తు చేయలేదని చెబుతున్నారు. అన్ని దరఖాస్తులను పూర్తి స్థాయిలో విచారిస్తున్నాం
– జమాల్‌బాషా, బీఎల్‌ఓ, నరసాపురం, కాశినాయన మండలం
కేసులు పెట్టమని చెప్పాం
నియోజకవర్గంలోని కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, కాశినాయన మండలాల్లో తొలగింపు దరఖాస్తులు వచ్చాయి. వీటిపై కేసులు నమోదు చేయమని తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశాం. కానీ పూర్తి వివరాలు తీసుకు వస్తే కేసులు పెడతామని పోలీసులు తెలియజేయడంతో ఆ పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ రోజు సాయంత్రం లోపు నాలుగు మండలాల పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేయిస్తాం.
– రామచంద్రారెడ్డి, ఆర్వో, బద్వేలు నియోజకవర్గం
Comments
Please login to add a commentAdd a comment