సాక్షి, కొత్తగూడెం: ఇన్నాళ్లూ తమకు జిల్లాలో అండదండగా ఉన్న రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిని ఏఐసీసీ దూరం పెట్టడంతో ఆమె అనుచరులు డోలాయమానంలో పడ్డారు. ఆమె చలువతో పార్టీ పదవులు, ప్రత్యక్ష ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయని భావించిన నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్కొక్కరు ఆమె వర్గం ముద్ర నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అసలు రేణుక వ్యవహారంపై తమకేమీ తెలియదన్నట్లు వారు గప్‌చుప్‌గా ఉండడంపై కాంగ్రెస్‌లో చర్చ కొనసాగుతోంది.
జిల్లాలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకొని, పార్టీలో ప్రత్యర్థులపై విమర్శలు చేయించిన రేణుకాచౌదరిని ఏఐసీసీ పక్కన పెట్టడంతో ఆమె ప్రధాన అనుచరులు ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాక మల్లగుల్లాలు పడుతున్నారు. ఆమెను నమ్ముకొని ఏకంగా మంత్రులను, రాహుల్‌గాంధీ ప్లేస్ ఆఫ్ బర్త్‌ను కూడా ప్రశ్నించడంతో అసలు పార్టీలో తమకు భవిష్యత్ ఉండదని ఆందోళన చెందుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడే కొంతమంది నేతలు ఆమె వర్గం ముద్ర నుంచి బయటపడాలని, లేకపోతే పార్టీలో తమ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందనే ఆలోచనలో ఉన్నారు. గతంలో ఖమ్మం నగర కమిటీ, భద్రాచలం పట్టణ కమిటీలో ఆమె తల దూర్చడం.. చివరకు ఆ కమిటీలను రద్దు చేస్తూ పీసీసీ నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఇటు రాష్ట్రం, అటు హస్తినలో ఆమె మాట చెల్లుబాటు కావడం లేదని భావిస్తున్నారు.
ఇంత జరిగినా కొంతకాలంగా ఆమె జిల్లాకు రాకపోవడంతో ఆమె వర్గంగా ఉన్న క్యాడర్‌లో నిస్తేజం నెలకొందని పార్టీలో చర్చించుకుంటున్నారు. సమైక్య వాదానికి మొగ్గుచూపిన రేణుకాచౌదరి వర్గంగా ముద్ర పడడంతో రానున్న రోజుల్లో తమకు ఇబ్బంది కానుందని ఆయా నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఆమె పదవి వ్యవహారంపై జిల్లాలోని ఒకరిద్దరు నాయకులు నేరుగా ఆమెతోనే చర్చించి ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. రేణుకకు మళ్లీ ఏఐసీసీలో స్థానం దక్కితే జిల్లాలో ఆమె అనుచరులుగా చక్రం తిప్పుతామన్న యోచనలో వారు ఉన్నట్లు సమాచారం.
పదవులు దక్కవని నిరాశ..
ఇంతకాలం రేణుక వర్గంగా ముద్రపడిన నేతలకు ఆమె ఎలాగో పార్టీ పరంగా, నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టడంలో తనదే పైచేయిగా నిరూపించుకున్నారు. కొంతకాలం నుంచి జిల్లాలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఆమె వ్యవహార ధోరణిని వ్యతిరేకించడంతో పదవుల పంపకాల్లో రేణుక ముద్రకు బ్రేక్ పడింది. ఏఐసీసీ చర్యలు, దరిమిలా అధిష్టానం ముందు ఆమె ప్రభావం తగ్గిపోవడంతో రాష్ట్ర విభజన జరిగినా, ఉమ్మడిగానే ఉన్నా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ వర్గం నేతలకు కనీసం కార్పొరేటర్ టికెట్లు వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆమెకు మద్దతిస్తూ జిల్లాలోని పార్టీ నేతల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇంకెన్ని కష్టాలు వస్తాయోనని భయపడుతున్నారు. ఆమె ఆహ్వానం మేరకు ఇటీవల పార్టీలో చేరిన ఓ నేత ప్రస్తుతం ఊగిసలాటలో ఉన్నట్లు సమాచారం. ఆమెనే నమ్ముకుని.. ఖమ్మం టికెట్‌పై కన్నేయడంతో ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన కంగుతిన్నట్లు తెలిసింది. తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారడంతో ఖమ్మం టికెట్‌పై సదరు నేత ఆశ వదులుకున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. తన రాజకీయ భవిష్యత్‌కు అనూహ్యంగా అడ్డంకులు ఎదురుకావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆయన ఉన్నట్లు సమాచారం.
ఇటీవల కొంతకాలం క్రితం వరకు రేణుక అనుచరులు, మంత్రి రాంరెడ్డి అనుచరులు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలతో డీసీసీ కార్యాలయం మార్మోగిపోయింది. రాహుల్‌గాంధీపై రేణుక అనుచరులు చేసిన వ్యాఖ్యల అనంతరం ఈ కార్యాలయంలో విమర్శలకు తెరపడింది. ఈ విషయంలో ఏఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేయడం, దీన్ని మంత్రి తనకు అనుకువగా మలుచుకోవడంతో.. ఇక డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టాలంటేనే రేణుక అనుచరులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటి వరకు డీసీసీ కార్యాలయం అంటేనే రేణుక కార్యాలయంగా ఉంది. అధిష్టానం ఆమెకు ప్రాధాన్యత తగ్గించడంతో ప్రస్తుతం కార్యాలయ నిర్వహణ నేతలు కూడా మిన్నకుండా ఉన్నారు. ఇదిలా ఉంటే రేణుక అనుచరులు కొందరు ఇప్పటికే జిల్లాలోని ఆమె ప్రత్యర్థి వర్గం నేతలు, ప్రజాప్రతినిధులతో చను వుగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారని తెలి సింది. రెండుమూడు రోజులుగా ఆయా ప్రజాప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమాలకు కూడా సదరు నేతలు హాజరుకావడం గమనార్హం.
డోలాయమానంలో రేణుక కేడర్
Published Mon, Nov 25 2013 3:12 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement