పరిశోధన సరే... ప్రోత్సాహం ఏదీ..?
- గిరిజన రైతుల దరి చేరని పరిశోధన కేంద్రం ఫలితాలు
- చింతపల్లిలో కూరగాయల శిక్షణ కేంద్రం లేక నష్టాలు
- విదేశీ కూరగాయలు పండేందుకు మన్యం అనుకూలం
- సదుపాయాలు లేక అక్కరకురాని పరిజ్ఞానం
కొయ్యూరు, న్యూస్‌లైన్ : చింతపల్లి ఉద్యానవన పరిశోధన కేంద్రంలో విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఎనిమిది రకాల కూరగాయలను ప్రయోగాత్మకంగా వేసి చూశారు. పంట బాగా వచ్చింది. రాష్ట్రీయ కృషీ విజ్ఞాన్ యోజన(ఆర్‌వీవై)లో వాటిని ప్రయోగాత్మకంగా వేశారు. రాత్రి సమయంలో పది డిగ్రీలకు తక్కువగా ఉండే వాతావరణంలో ఆ పంటలు పండుతాయని శాస్త్రవేత్తల పరిశోధనలో నిర్ధారణ అయింది.
అయితే ఈ ఫలితాలు గిరిజనులకు చేరాలంటే...గిరిజనులు ఈ కూరగాయలను సాగు చేయాలంటే.... శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలకు అనుగుణంగా కూరగాయల శిక్షణ కేంద్రాన్ని (వీటీసీ) ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడ పరిశోధన కేంద్రంలో పండించిన కూరగాయలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వాటిపై రైతులకు అవగాహన కలగాలంటే వీటీసీ ఉండాలి. కానీ ఆ దిశలో ఇంతవరకూ ప్రయత్నాలు జరగలేదు. ఈ కేంద్రం ద్వారా గిరిజన రైతులను అనేక విధాల ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అవకాశాలున్నా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో ప్రయోగాల ప్రయోజనాలు గిరిజనులకు అక్కరకు రావడం లేదు.
కనీసం పండించిన పంటను కొన్నాళ్లు దాచుకునేందుకు అవసరమైన శీతలగిడ్డంగులు(కోల్డ్ స్టోరేజీ) సౌకర్యం కూడా లేకపోవడంతో గిరిజన రైతులకు లాభాలు రావాల్సిన చోట నష్టాలు వస్తున్నాయి. చింతపల్లిలో మార్కెట్ కమిటీ ఉన్నా ఎలాంటి ఉపయోగం లేకపోయింది. దాని ఆధీనంలో వీటీసీ ఉంటే వందలాది మంది రైతులకు శిక్షణ ఇచ్చేందుకు వీలు కలుగుతుందని, కనీసం ఐటీడీఏ చింతపల్లిలో వీటీసిని ఏర్పాటు చేసినా బాగుంటుందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
ఏమేం పండించవచ్చు?
చింతపల్లి పరిశోధన కేంద్రంలో బ్రకోలి, రెడ్ క్యాబేజీ, చైనీస్ క్యాబేజీ, లటస్, ప్రచోరి రకం కూరగాయలు పండించారు. వీటిలో బ్రకోలిలో క్యాన్సర్‌ను నివారించే యాంటి ఆక్సిటెండ్లున్నాయి. దీని ధర ఇతర ప్రాంతాల్లో కిలో రూ.150 వరకు పలుకుతుంది. ప్రధానంగా మెట్రో నగరాల్లో వాటికి మంచి డిమాండ్ ఉంది. అయితే మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో ఇంత విలువైన కూరగాయలు పండించినా గిరిజనులు లాభపడేది అనుమానమే.
ప్రోత్సహిస్తే మన్యం మరో కొడెకైనాలే!
విదేశాల్లో గిరాకీ ఉన్న కూరగాయలను పండించే ప్రాంతం దక్షిణ భారతదేశంలో ఒక్క కొడెకైనాల్ మాత్రమే. అక్కడ శీతల గిడ్డంగులు ఉండడంతో రైతులు తాము ఒక్కసారి పండించిన కూరగాయలను దఫ దఫాలుగా అమ్ముకుంటున్నారు. మన్యంలో కూరగాయల సాగుకు వాతావరణం అనుకూలించినా... శీతల గిడ్డంగులు లేక నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. దీంతో ఇతర మార్కెట్లతో అనుసంధానమై తమ పంటలను మంచి ధరలకు అమ్ముకునే అవకాశం లేకుండా పోతోంది. దీంతో దళారుల బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై ‘న్యూస్‌లైన్’ చింతపల్లి మార్కెట్ కమిటీ సహాయ కార్యదర్శి జగన్‌ను సంప్రదించగా గిరిజన రైతులు కోల్డ్ స్టోరేజీ కావాలని కోరితే ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని చెప్పారు. స్టోరేజీ ఉంటే ధరలు పెరిగినప్పుడు వాటిని అమ్ముకునే అవకాశం రైతులకు ఉంటుందన్నారు.