పవన్‌కల్యాణ్ స్పందించాలి
లబ్బీపేట : ఏ అన్యాయం జరిగినా గళమెత్తే జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇంత అన్యా యం జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆయన అండగా ఉన్నానని చెప్పడంతో పవన్ చెప్పిన పార్టీకి ఓట్లు వేశామని, ఇప్పుడు తమకు అన్యాయం జరుగుతుంటే స్పందించాలని కోరుతూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించినట్లు పేర్కొన్నారు. ఆ గ్రామానికి చెందిన సుమారు 30 మంది రైతులు జనసేన పేరుతో గురువారం రాత్రి ఓ చానల్ కార్యాలయం వద్దకు వచ్చారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్‌పై పవన్‌కల్యాణ్ స్పందించాలని కోరారు.
గతంలో తమ గ్రామానికి 450 ఎకరాలు ఉండేదని, 30ఏళ్ల కిందట ఉడా 250 ఎకరాలు తీసుకోవడంతో 200 ఎకరాలు మిగిలినట్లు చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం తమ భూమి తీసుకుని ఏడాదికి రూ.30వేలు ఇస్తానంటోందని, అది ఏమూలకు సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తరఫున పవన్ కల్యాణ్ నిలవాలనే ఉద్దేశంతోనే ఇలా రోడ్డెక్కినట్లు తెలిపారు. కార్యక్రమంలో వాసా శ్రీనివాసరావు, పి.వీరబాబు. వి.సుబ్బారావు, ఆర్.కోటేశ్వరరావు పాల్గొన్నారు.