సామాన్య ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసే నగర పాలక సంస్థ అధికారులు రాజకీయ పలుకుబడి ఉన్న బడాబాబుల జోలికి మాత్రం వెళ్లడంలేదు.
నెల్లూరు సిటీ: సామాన్య ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసే నగర పాలక సంస్థ అధికారులు రాజకీయ పలుకుబడి ఉన్న బడాబాబుల జోలికి మాత్రం వెళ్లడంలేదు. అందుకు నిదర్శనమే... మున్సిపాలిటీ షాపుల వ్యవహారం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 ఏళ్ల నుంచి షాపులను కొందరు పెద్దలు తమ గుప్పిట్లో పెట్టుకున్నారు.
ఆయా షాపులకు కాలపరిమితి ముగిసినప్పటికీ అధికారులు దుకాణాలకు కొత్తగా టెండర్లు పిలవకుండా పాత వ్యక్తులకే కట్టబెడుతున్నట్లు విమర్శలున్నాయి. దీనిపై ప్రశ్నించేవారు లేకపోవడంతో అటు లీజుదారుడు, ఇటు రెవెన్యూ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బందికి భారీగా ముడుపులు అందుతుండటంతో తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుందని తెలిసినా ఇలా చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
కొందరి కనుసన్నల్లోనే ..
నెల్లూరు నగర పాలకసంస్థ పరిధిలో 14 మున్సిపాలిటీ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. అందులో 234 షాపులున్నాయి. వీటిలో 64 షాపులు 25 ఏళ్ల నుంచి, 100 నుంచి 120 షాపులు 10 ఏళ్ల పైనుంచి కొందరి చేతుల్లోనే ఉన్నాయి. కార్పొరేషన్ నిబంధనల ప్రకారం షాపు తీసుకొని మూడేళ్ల కాలపరిమితి నిండితే ఆ షాపులకు వేలంపాట నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ నిబంధనలు అమలు కావట్లేదు. బడాబాబుల కోసం రెవెన్యూ సిబ్బంది కొన్నిసార్లు వేలంపాటలే నిర్వహించని సంఘటనలున్నాయి. వీళ్లు వాటిలో కాంప్లెక్సు లు కట్టుకొని, అధిక ధరకు బయటి వ్యక్తులకు బాడుగలకు ఇచ్చి లాభాలు గడిస్తున్నారు. అయితే కార్పొరేషన్‌కు నెలకు నామమాత్రంగా బాడుగ చెల్లిస్తున్నారు.
మున్సిపాలిటీ షాపుల వివరాలు
నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న మున్సిపల్ షాపుల వివరాలు ఇలా ఉన్నాయి. జేవీఆర్ (జలగం వెంగళరావు కాంప్లెక్స్)లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో-22, మిద్దెపైన 5షాపులు. ఎన్‌సీ బిల్డింగ్స్ (ఆత్మకూరు బస్టాండు) గ్రౌండ్‌ఫ్లోర్‌లో 17, మిద్దెపైన 3 షాపులు. ప్రకాశం పంతులు షాపింగ్ కాంప్లెక్స్‌లో 18, సుబేదారుపేట షాపింగ్ కాంప్లెక్స్‌లో 13, బీవీఎస్‌ఎమ్ కాంప్లెక్స్‌లో 16, పప్పుల వీధిలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో 24, ఏసీ భవన్ షాపింగ్ కాంప్లెక్స్‌లో 12, పనుతల వారి కాంప్లెక్స్‌లో 13, చిన్నబజారు షాపింగ్ కాంప్లెక్స్‌లో 38, డైకాస్‌రోడ్డు ఓల్డ్ ఫిష్ మార్కెట్‌లో 06, సౌదావ్య కాంప్లెక్స్‌లో 15, డైకాస్ రోడ్డులోని షాపింగ్ కాంప్లెక్స్‌లో 05, ఏసీ విహార్ కాంప్లెక్స్‌లో 05, ఏసీ సుబ్బారెడ్డి షాపింగ్ కాంప్లెక్స్‌లో 22 షాపులు ఉన్నాయి.
ఐదు సార్లు వేలం రద్దు
నగర పాలక సంస్థ పరిధిలో స్టౌన్‌హౌస్‌పేటలోని 9 షాపులకు ఇప్పటికీ ఐదుసార్లు వేలం పాట నిర్వహించాలనుకొన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదాపడుతూ వస్తుంది. ఈ కాంప్లెక్స్‌లో 9 షాపులున్నాయి. సుమారు రెండేళ్లపై నుంచి వేలంపాట నిర్వహణ జరపలేదు. కొన్నిసార్లు టెక్నికల్ సమస్య రాగా, ఇతర కారణాలతో వేలం వాయిదా పడుతోంది.