బొండా ఉమా కబ్జా చేసిన స్థలం
విజయవాడ: స్వాతంత్య్ర సమరయోధుని స్థలం కబ్జా వ్యవహారంలో బొండాగిరి ఒత్తిడికి తలొగ్గి చేసిన అవకతవకల్లో రెవెన్యూ సిబ్బంది మెడకు ఉచ్చుబిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా అడంగల్స్ మార్పులో అధికార పార్టీ నేతల తీవ్ర ఒత్తిడి వల్ల రియల్ ఎస్టేట్ మాఫియా చెప్పినట్లు చేయటంతో రెవెన్యూ యంత్రాగం రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో తహసీల్దార్ గురువారం నుంచి సెలవుపై వెళ్లినట్లు సమాచారం. తొలుత నాలుగు రోజులు సెలవు పెట్టిన ఆయన సోమవారం నుంచి దీర్ఘకాలికంగా సెలవు పొడిగిస్తారని రెవెన్యూ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తన కుమార్తె అనారోగ్యం కారణంగా సెలవుపై వెళ్లినట్లు ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉండగా తహసీల్దార్ సెలవుపై వెళ్లడంతో అడంగల్స్‌లో పేర్లు మార్చిన కిందిస్థాయి సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ఈ వ్యవహారంలో సర్వేయర్, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ, ఆర్‌ఐ, డిప్యూటీ తహసీల్దార్ భయంతో వణుకుతున్నారు. అడంగల్స్‌లో పేర్లు మార్చటం వల్లే బొండా అనుచరులు దొంగ రిజిస్ట్రేషన్లు చేయించేందుకు ఆస్కారం ఏర్పడిందని భావిస్తున్నారు.
మ్యూటేషన్‌లో నిబంధనలకు పాతర
మ్యూటేషన్ (అడంగల్‌లో పేర్లు మార్పు) చేసేటప్పుడు తాజా నిబంధనలు పరిగణలోకి తీసుకోలేదని వెల్లడైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దరఖాస్తులపై స్వాతంత్య్ర సమరయోధుని భూమికి సంబంధించి అడంగల్స్ మార్చటంలో నిబంధనలకు పాతరేసినట్లు విమర్శలు వస్తున్నాయి. 2016 వరకు స్వాతంత్య్ర సమరయోధుడు కేశిరెడ్డి సూర్యనారాయణ ఆయన కుటుంబసభ్యుల పేరుతో అడంగల్స్‌లో ఉన్నాయి. ఆర్‌ఎస్ నెం.7/2 లో ఎ1.00 సెంట్లు భూమి కేశిరెడ్డి సూర్యనారాయణ పేరుతో, ఆర్‌ఎస్ నెం. 6/1లో ఎ.1.50సెంట్లు కేశిరెడ్డి సూర్యారాయణ కోడలు జోగా రత్నం పేరుతో అడంగల్స్ ఉన్నాయి. ఈ భూమిని 2016లో కృష్ణలంకకు చెందిన రామిరెడ్డి కోటేశ్వరరావు పేరున రెవెన్యూ అధికారులు మార్చారు.
1988లో నకిలీ డాక్యుమెంటు ఆధారంగా రెవెన్యూ అధికారులు రామిరెడ్డి కోటేశ్వరరావు పేరున అడంగల్స్ మార్చారు. అడంగల్స్ మార్చిన తరువాత ఆ భూమిని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరుడు రియల్టర్ మాగంటి బాబుకు కోటేశ్వరరావు డవలప్‌మెంట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ భూమి తనది కాదని తనకు తెలియకుండా మాగంటి బాబు మోసం చేసి డవలప్‌మెంట్ అగ్రిమెంటు తాను రాసినట్లు రిజిస్ట్రేషన్ చేయించాడని సీఐడీ అదికారులకు చెప్పాడు. స్వాతంత్య్ర సమరయోధుని భూమికి సంబంధించి ఆర్‌ఎస్.నెం.32లో ఎ.1.50 సెంట్లు, ఆర్‌ఎస్.నెం40లో ఎ.1.70సెంట్లు అబ్దుల్ మస్తాన్ పేరుతో కేశిరెడ్డి సూర్యనారాయణకు చెందిన భూమిని అడంగల్స్‌లోకి మార్చారు. తాడిగడపకు చెందిన అబ్దుల్ మస్తాన్ 1988లో స్వాతంత్య్ర సమరయోధుని కుటుంబం నుంచి ఆ భూమిని కొనుగోలు చేసినట్లు నకిలీ డాక్యుమెంట్ల సృష్టించారు. ఈ భూమిలో కొంత భాగం సెంట్రల్ ఎమ్మెల్యే భార్య బొండా సుజాత, వారి అనుచరుడు రియల్టర్ మాగంటి బాబులు డవలప్‌మెంట్ అగ్రిమెంటు రాయించుకున్నారు. సీఐడీ విచారణతో బొండా సుజాత ఆ అగ్రిమెంటును రద్దు చేసుకున్నారు.
1997 వరకు జీవో లేదు
స్వాతంత్య్ర సమరయో«ధులకు కేటాయించిన భూమిని విక్రయించేందుకు 1997లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. 1997కు ముందు అటువంటి భూములు క్రయవిక్రయాలు జరపాలంటే జిల్లా కలెక్టర్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంది. బొండాగిరిలో 2016లో అడంగల్స్ పేర్లు మార్చేటప్పుడు కనీస నిబంధనలు పాటించకపోవటం గమనార్హం. మ్యూటేషన్ చేసేటప్పుడు అనుభవదారులుగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధుని కుటుంబసభ్యులను కనీసం విచారించలేదు. 1988 నకిలీ డాక్యుమెంటు ఆధారంగా పేర్లు మార్చారు. ఆ డాక్యుమెంట్లు ఎంత వరకు సరైనవో చూడకుండా అడంగల్స్ ఇష్టారాజ్యంగా మార్చటం రెవెన్యూ అధికారుల మెడకు ఉచ్చు పడింది.
Comments
Please login to add a commentAdd a comment