పలాస: తహశీల్దార్ కార్యాలయంలోని రెవెన్యూ అధికారుల అవినీతిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. దీంతో ఏం జరుగుతుందోనని కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ‘ఆహా... ఏమి కృప’ శీర్షికన ఫిబ్రవరి 24న ‘సాక్షి’ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 10వ వార్డు పరిధి నర్సిపురంలోని సర్వే నంబరు 187లో 5.78, సర్వే నంబరు 188లో 3.89 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. 9.67 ఎకరాల ఈ స్థలంలో 620 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించి అధికారులు లేఅవుట్లు వేశారు. 2003లో లేఅవుట్ వేసి పట్టాలు ఇచ్చారే గానీ లబ్ధిదారులకు స్థలాలు చూపించలేదు.
దీంతో ఎమ్మెల్యే, తహశీల్దార్ కార్యాలయం అధికారులు మారినప్పుడు ఈ స్థలంలోనే మరికొందరికి పట్టాలు పుట్టుకొచ్చాయి. ఇది అవినీతి అధికారులకు కాసుల పంట కురిపించింది. సార్వత్రిక ఎన్నికల ముందు బదిలీ అయిన అప్పటి తహశీల్దార్ ఎల్.పార్వతీశ్వరరావు కూడా సుమారు 100 మందికి పట్టాలు ఇచ్చారని, రూ.కోటి చేతులు మారుంటాయన్న ఆరోపణలు వినిపించాయి. అప్పటి కేంద్ర మంత్రి కృపారాణి ఆశీస్సులతో పార్టీ కార్యకర్తలకు పట్టాలు ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే సూదికొండ, నెమలినారాయణపురం, ఇంగిలిగాం, పెంటిభద్ర, తర్లాకోట తదితర ప్రాంతాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూములను విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి వెళ్లాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
అధికారుల నుంచి డీ పట్టాలు పొందిన అనంతరం వాటిని పక్క జిరాయితీ సర్వే నంబర్లు వేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని కోట్లాది రూపాయల వ్యాపారాలు చేస్తున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర వాటికి వినియోగిస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన నాలా పన్ను ఎగ్గొడుతున్నారు. ఈ విధంగా పలాస-కాశీబుగ్గ పట్టణంలో ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. వాగులు, వంకలు ఇప్పటికే పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి. వీటిపై పలుమార్లు ‘సాక్షి’లో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు పలాస తహశీల్దార్ కార్యాలయంపై దృష్టి సారించినట్లు సమాచారం. తహశీల్దార్ కార్యాలయంలో దిగువ స్థాయి సిబ్బంది చెప్పిందే వేదంగా పనులు జరుగుతున్నట్టు కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై కూడా అధికారులు దృష్టిసారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
పలాస ‘రెవెన్యూ’పై ఏసీబీ ఆరా!
Published Mon, Jul 7 2014 2:08 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement