సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 30న ఉదయం 9.49 గంటలకు ప్రయోగించబోయే పీఎస్‌ఎల్‌వీ సీ23 ప్రయోగానికి సంబంధించి శుక్రవారం మిషన్ రెడీనెస్ రివ్యూ కమిటీ, లాంఛ్ ఆథరైజేషన్ బోర్డు సంయుక్తంగా మిషన్ సింసిద్ధతా సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాకెట్‌లోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పరిశీలించి 28న ఉదయం 8.49 గంటలకు కౌంట్‌డౌన్, 30న ఉదయం 9.49 గంటలకు ప్రయోగాన్ని నిర్వహించేం దుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
మిషన్ సంసిద్ధతా సమావేశం అనంతరం ప్రయోగానికి సంబంధించి లాంఛ్ రిహార్సల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రయోగానికి సంబంధించి అన్ని ఏర్పాట్లును పూర్తి చేసి గురువారం షార్ కేంద్రంలో అంతా సిద్ధంగా వుందని తెలిపేందుకు ఓవరాల్ రెడీనెస్ రివ్యూ (ఓఆర్‌ఆర్) నిర్వహించి అన్ని పరీక్షలు పూర్తి చేసి రాకెట్‌ను ఎంఆర్‌ఆర్ కమిటీకి అప్పగించారు. 28న రుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో, 29న చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ కే రాధాకృష్ణన్‌పూజలు చేస్తారు.