
నర్సీపట్నం చుట్టూ రింగు రోడ్డు
పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం టౌన్: నర్సీపట్నం చుట్టూ రింగ్ రోడ్డును నిర్మించనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడుతూ రింగురోడ్డు ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు.
జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా విభాగం కింద 912 పంచాయతీల్లో 17 వేల 634 బోర్లు, 2,567 మంచినీటి పథకాలున్నాయన్నారు. వీటిలో పనిచేస్తున్నవి ఎన్ని, పని చేయనివి ఎన్ని తదితర వివరాలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. వారిచ్చే నివేదిక ఆధారంగా పని చేయని వాటిని వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. జిల్లాలో విద్యకు ప్రాధాన్యం ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించామన్నారు.
జిల్లాలో 247 ఉన్నత, 304 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయన్నారు. వీటిలో తాగునీరు, ఫ్లోరింగ్, మరుగుదొడ్ల సౌకర్యాలకు చర్యలు చేపట్టామన్నారు. పీఎంజీఎస్‌వై పథకం ద్వారా గిరిజన గ్రామాల్లో తారురోడ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ.201 కోట్లతో చేపట్టాల్సిన 62 పనులు అప్పటి గిరిజన సంక్షేమశాఖ మంత్రి బాలరాజు నిర్వాకంతో నిరుపయోగమైనట్టు తెలిపారు. వారం రోజుల్లో పాడేరులో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు.
ఉపాధి పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో రూ.1500 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇన్నీ నిధులు ఖర్చు చేసినా శాశ్వత పనులు కానరాలేదన్నారు. ఇకపై కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు శాశ్వత పనులకు ప్రాధాన్యమిస్తామన్నారు. ఈ పనుల్లో రూ.3 కోట్ల 72 లక్షల అవినీతి జరిగిందని అధికారులు చెబుతున్నా వాస్తవం కాదన్నారు. జరిగిన పనుల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు.
అవినీతి రుజువైతే సోషల్ అడిట్ అధికారులు కూడా తప్పు చేసినట్టవుతుందన్నారు. వాస్తవంగా ఉపాధి పనులకు వెళ్లే వారి సంఖ్య కంటే తప్పుడు మస్తర్లు వేస్తున్నారన్నారు. అమలాపురం పంచాయతీలో జీడిపిక్కల కర్మాగారానికి వెళ్లే మహిళలు పేరున మస్తర్లు వేశారన్నారు. వెంటనే ఆ వీఆర్పీని విధుల నుంచి తొలగించాలని పీడీని ఆదేశించినట్టు పేర్కొన్నారు.
ఉపాధిలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఆదర్శ రైతుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ కమిటీ, దేవాలయాల కమిటీలను రద్దు చేసి కొత్తవాటిని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. సమర్థులను వాటిలో నియమించనున్నట్టు తెలిపారు.