ఆర్‌కే ఇన్‌ఫ్రా అక్రమాలెన్నో..? | RK Infra Fraud In YSR Kadapa District | Sakshi
Sakshi News home page

ఆర్‌కే ఇన్‌ఫ్రా అక్రమాలెన్నో..?

Published Sun, Feb 16 2020 12:10 PM | Last Updated on Sun, Feb 16 2020 12:12 PM

RK Infra Fraud In YSR Kadapa District - Sakshi

అరకొరగా జరిగిన హంద్రీ–నీవా కాలువ పనులు 

సాక్షి, కడప : ఐటీ దాడుల నేపథ్యంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్‌కే ఇన్‌ఫ్రా అక్రమాలు పెద్దఎత్తున బయటపడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లతో ఆర్‌కే ఇన్‌ఫ్రా అధినేత మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు రోడ్డున పడుతున్నాయి. ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా వీరి సంబంధాలు కొనసాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీ విచారణలోనూ ఈ విషయాలు బయటపడినట్లు సమాచారం. రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీల్లో మూడు ఇన్‌ఫ్రా కంపెనీల భాగస్వామ్యం ఉండగా ఆర్‌కే ఇన్‌ఫ్రా సైతం కీలకపాత్ర పోషించినట్లు ఐటీ విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయితే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లకు ఆర్‌కే ఇన్‌ఫ్రా అధినేత ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకూరినట్లు సొంత పార్టీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేతకు ఇతర రాష్ట్రాల నుంచే గాక ఇతర దేశాల నుంచి సైతం మూడు ఇన్‌ఫ్రా కంపెనీల ద్వారా నిధులు సమకూరినట్లు ఐటీ సోదాల్లో వెల్లడైంది. ఇందులో కడపజిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్‌కే ఇన్‌ఫ్రా పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ. 2000 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఇప్పటికే ఐటీ ప్రాథమికంగా ప్రకటించింది. లోతైన విచారణ పూర్తి చేస్తే మరిన్న అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు  తెలుస్తోంది. 

ప్రముఖ కాంట్రాక్టర్, ఆర్థికంగా బలోపేతుడైన శ్రీనివాసులురెడ్డిని చంద్రబాబు, లోకేష్‌బాబులు దగ్గరకు చేర్చుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న అతన్ని 2014 పార్లమెంటు ఎన్నికల్లో కడప నుంచి టీడీపీ అభ్యరి్థగా పోటీ చేయించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. కోట్లు కొల్లగొట్టేందుకు టీడీపీ అధినేత ఆర్‌కే ఇన్‌ఫ్రాను నిధులు సమకూర్చే సాధనంగా వాడుకున్నారు. పెద్ద ఎత్తున కాంట్రాక్టులు కట్టబెట్టారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా రూ. 200 కోట్లతో పూర్తయ్యే కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను సింగిల్‌ టెండర్‌ దాఖలు చేసి ఆర్‌కే ఇన్‌ఫ్రాకు రూ. 450.85 కోట్లకు కట్టబెట్టారు.

అంతేకాకుండా డిజైన్లు మారడం వల్ల పనుల పరిణామం పెరిగిందని అదనంగా రూ. 129 కోట్లను దోచిపెట్టారు. హంద్రీ–నీవా రెండోదశ పనులను ఆర్‌కే ఇన్‌ఫ్రాకు అప్పగించారు. చేయని సొరంగం పనులకు రూ. 35 కోట్లు దోచిపెట్టారు. ఇది కాకుండా ప్రకాశం జిల్లాలో పాత కాంట్రాక్టర్లను నిబంధనలను విరుద్ధంగా పక్కన పెట్టి వెలిగొండ పనులను ఆర్‌కే ఇన్‌ఫ్రాకు అప్పగించారు. ఇందులో భాగంగా రూ. 91.15 కోట్ల కొల్లంవాగు హెడ్‌ రెగ్యులేటర్‌ పనులను కట్టబెట్టారు.హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు పూర్తి చేయకుండానే రూ. 17 కోట్లు దోచిపెట్టారు. వీటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌కే ఇన్‌ఫ్రాకు టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కాంట్రాక్టు పనులు అప్పగించింది.

నిబంధనలకు విరుద్ధంగా అంచనాలు పెంచుకుని పోటీ లేకుండా ఏకపక్షంగా టెండర్లు నిర్వహించి బాబు అండ్‌ కో ఆర్‌కే ఇన్‌ఫ్రాకు పనులు కట్టబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తక్కువ కాలంలోనే చంద్రబాబుకు దగ్గరకైన ఆర్‌కే ఇన్‌ఫ్రా అధినేతకు ఊహించని రీతిలో కాంట్రాక్టు పనులు అప్పగించడంపై అప్పట్లో టీడీపీలోని ఓ వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.  రాష్ట్రంతోపాటు దేశ వ్యాప్తంగా కోట్లాది రూపాయల నిధులు ఇన్‌ఫ్రా కంపెనీల ద్వారానే పార్టీ అధినేత చంద్రబాబుకు చేరినట్లు ఐటీ శాఖ గుర్తించినట్లు సమాచారం. ఇందులో ఆర్‌కే ఇన్‌ఫ్రాకు భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది.ఐటీ విచారణ పూర్తయితే ఏ కంపెనీలకు ఎన్ని వందల కోట్ల నిధులు అక్రమంగా తరలివచ్చాయో బహిర్గతమవుతుంది. ఆర్‌కే ఇన్‌ఫ్రా అక్రమాలు టీవీలు, పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా రావడంతో జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలు, టీడీపీ వర్గాల వారు విమర్శలు గుప్పిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement