
సాక్షి, ఇడుపులపాయ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీ కదిలేవరకూ, తెలుగుదేశంను ఇంటిదారి పట్టించే వరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ఆగదని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇడుపులపాయలోని సభా ప్రాంగణంలో సోమవారం ఆమె మాట్లాడారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తానంటే తెలుగుదేశం పార్టీ నేతల్లో, మంత్రులకు దిమ్మతిరిగిందన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న ప్రభుత్వానికి యువత రాజన్న రక్తం వస్తోందని తొడగొట్టి చెప్పాలని పేర్కొన్నారు. రైతులను, మహిళలను, విద్యార్థులను మోసం చేసిన ప్రభుత్వాన్ని గద్దె దింపేదుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. వైఎస్‌ఆర్ కుటుంబం మాట తప్పదు.. మడమ తిప్పదు.. అంటూ ఈ విషయం పలు అంశాల్లో రుజువైందని గుర్తు చేశారు.
పాదయాత్ర వృథా అని అంటున్న వారికి రాష్ట్రంలో సమస్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులు గ్రామాల్లో తలెత్తుకు తిరిగారని అన్నారు.