కోలాహలంగా రొట్టెల పండుగ
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా : పట్టణంలోని బారా షహీద్ దర్గా వద్ద శనివారం రొట్టెల పండుగ కోలాహలంగా ప్రారంభమైంది. మహిళలు పరస్పరం రొట్టెలను మార్చుకున్నారు. సర్వ మతాల వారు ఐక్యంగా జరుపుకునే ఈ పండుగకు ఘనమైన చరిత్ర ఉంది. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధ మహోత్సవం, సోమవారం రొట్టెల పండుగ నిర్వహిస్తారని దర్గా ముజావర్ రఫీ తెలిపారు.
లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు వక్ఫ్ బోర్డు, నగరపాలక సంస్థ విస్తృత ఏర్పాట్లు చేశారు. మరుగుదొడ్లు, వాటర్ ప్రూఫ్ షామియానాలను ఏర్పాటు చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచిత మంచి నీటిని అందిస్తుండగా, మరి కొన్ని సంస్థలు అన్నదాన సదుపాయాన్ని కల్పించాయి. నగరంలోని ఆసుపత్రులు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ జానకి తెలిపారు.