సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమిని మూటకట్టుకుని ఓ వైపు.. రూ.కోట్లు సొమ్ము పోగొట్టుకుని మరోవైపు టీడీపీ శ్రేణులు గొల్లుమంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ముందు నుంచే బెట్టింగ్ రాయుళ్లు గెలుపోటములపై భారీ పందేలకు దిగారు. రానురాను వారిలో టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుపై నమ్మకం సన్నగిల్లడంతో ఎన్నికల తేదీ నాటికి టీడీపీ గెలుపుపై సొంత పార్టీ శ్రేణులే వెనక్కు తగ్గారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే అంశం మినహాయించి నియోజకవర్గాల వారీగా టీడీపీ, వైఎస్సార్ సీపీ గెలుపోటములపై బెట్టింగులకు పరిమితమయ్యారు.
పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత చంద్రబాబు సొంత గూటి చిలుక లగడపాటి లీకులిచ్చి, ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించడంతో మళ్లీ టీడీపీ శ్రేణులు బెట్టింగులకు దిగారు. రూపాయికి రూపాయిన్నర ఇస్తామని కొన్ని నియోజకవర్గాల్లో బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగింది. దీంతో గడిచిన పది రోజుల్లోనే రూ.700 కోట్ల వరకు చేతులు మారినట్లు అంచనా. మొత్తం రూ.వెయ్యి కోట్లు వరకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో బెట్టింగులకు పాల్పడినట్లు సమాచారం. ఫలితాలు ఏకపక్షంగా ఉండటంతో 80 శాతం డబ్బు టీడీపీ శ్రేణులు, 20 శాతం జనసేన పోగొట్టుకున్నాయి.
బెట్టింగులను ప్రోత్సహించింది చంద్రబాబే..
టీడీపీ గెలుపు అవకాశాలపై వీసమెత్తయినా సందేహించవద్దని చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. టీడీపీయే గెలుస్తుందని బుకీలు భారీగా బెట్టింగులు పెడుతున్నారని స్వయానా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌లో పేర్కొనడంతో ఆ పార్టీ శ్రేణులు బెట్టింగుల వైపు మళ్లారు. తెలుగువారున్న అన్ని రాష్ట్రాల్లోనూ, ఇతర దేశాల్లో ఉన్న వారిని టీడీపీ నేతలు రెచ్చగొట్టి మరీ బెట్టింగుల వైపు మళ్లించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదని బెట్టింగులకు దిగారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఖజానా నుంచి లగడపాటి బినామీ సంస్థకు దోచిపెట్టిన సొమ్ముతో ఎగ్జిట్ పోల్స్ చేయించారు. పోలింగ్ ప్రక్రియ ముగియడానికి ఒక రోజు ముందు లీకులు.. ప్రక్రియ ముగిశాక టీడీపీ ఘన విజయం సాధించబోతుందని లగడపాటితో చిలుక పలుకులు పలికించారు.
వీటిని నమ్మిన టీడీపీ ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు, టీడీపీ సానుభూతిపరులైన బడా పారిశ్రామికవేత్తలు, నేతలు భారీ బెట్టింగులు కాశారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ బరిలోకి దిగారు. వైఎస్సార్ సీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పోటీ పడటంతో ఈ నియోజకవర్గ రాజకీయం రసకందాయంగా మారింది. లోకేష్ గెలుపుపైనా బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలకు దిగారు. ముఖ్యంగా టీడీపీ నేతలు లోకేష్ గెలుపుపై గట్టి ధీమా ప్రదర్శించి రూ.వందల కోట్లు పోగొట్టుకున్నారు. ఫలితాలు ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీకి రావడంతో టీడీపీ ఓడిపోవడం, జనసేన ఘోర పరాజయం పాలవ్వడంతో ఆ పార్టీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లాయి. చంద్రబాబు, లగడపాటి మాటలు నమ్మి బెట్టింగులు కాసి భారీగా డబ్బు పోగొట్టుకుని నెత్తీ నోరు బాదుకుంటున్నాయి.
రూ.1000 కోట్లు హుష్ కాకి!
Published Fri, May 24 2019 4:34 AM | Last Updated on Fri, May 24 2019 4:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment