
చెరలో రూ.వంద కోట్ల భూమి!
మారేడుపూడిలో జోరుగా కబ్టాల పర్వం
మాయమవుతున్న చెరువులు, వాగులు
{పభుత్వ భూములకు రక్షణ కరువు
మా హయాంలో కాదంటున్న రెవెన్యూ సిబ్బంది
జాతీయ రహదారికి అనుకొని ఉంది మారేడు పూడి గ్రామం. అభివృద్ధిలో వెనుకబడినప్పటికీ విలువైన సహజ నిక్షేపాలకు కొదవలేదు. భవిష్యత్‌లో ఎంతో అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పుష్కలం. ఇంకేముంది ఆ గ్రామ భూములపై భూ రాబందులు, కబ్జాకోరులు, ఆక్రమణదారులు కన్నేశారు. ఇదే తడవుగా అనుమతి, ఎటువంటి పత్రాలు లేకుండా ఇళ్లు నిర్మించేందుకు ఒక ముఠా ఏర్పడింది. అనుమతులు లేకుండా లే-అవుట్‌లు వేసి అమాయకులకు విక్రయించడం మరో ముఠా పని. ఇలా అన్ని రకాలుగా మారేడుపూడిలో కబ్జాకు గురికానున్న ప్రభుత్వ భూముల విలువ అక్షరాలా రూ. 100 కోట్ల పైమాటే.
అనకాపల్లి: అనకాపల్లి మండలంలో మారేడుపూడి పంచాయతీ కేంద్రం. ఈ పంచాయతీ పరిధిలో బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, గన్నువానిపాలెం, చిన సాలాపువానిపాలెం ఉన్నాయి. పంచాయతీ జనాభా 2300 కాగా ఓటర్లు 1700 మంది ఉన్నారు. సుమారు 159 సర్వే నంబర్ల పరిధిలో 395.24 ఎకరాల విస్తీర్ణంలో కొండ, వాగులు, చెరువులు, బందలు ఉన్నాయి. ఐదు గ్రామాల పరిధిలో 700 వరకూ ఇళ్లు ఉండగా, అధికారికంగా అసెస్‌మెంట్ ఉన్న ఇళ్లు 404. కొద్ది నెలల క్రితం సమాచార హక్కు చట్టం ద్వారా స్థానికుడు సేకరించిన సమాచారం మేరకు 2011లోనే అనుమతి ఉన్న ఇళ్ల సంఖ్య 346కాగా, ఈ నాలుగే ళ్లలో అధికారికంగా158 ఇళ్లు, అనధికారికంగా మూడొందలకు పైగా ఇళ్లు నిర్మించారు.
అక్రమ లేవుట్లు..
మారేడుపూడి కేంద్రంగా అక్రమ లే-అవుట్లు పుట్టుకొచ్చాయి. స్థానికులు కొందరు అక్రమ లే-అవుట్ నిర్మాణదారులకు సహకారం అందించడంతో విలువైన ప్రభుత్వ స్థలాలు అక్రమార్కుల పాలవుతున్నాయి. పంచాయతీ పరిధిలో అధికారికంగా ఒక ప్రైవేట్ లే-అవుట్ ఉండగా, అనధికారికంగా నాలుగైదు లే-అవుట్లు నిర్మించి విక్రయాలు కూడా జరిపారు. ఈ దశలోనే చెరువు బంద మీదుగా దారి వేసుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు గ్రామంలో గుడి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయిలు ఇస్తామని లే-అవుట్ నిర్వాహకులు నమ్మబలికారు. దీంతో కొండ ఎగువ ప్రాంతం నుంచి చెరువులకు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లాల్సిన వర్షపు నీరు అక్రమ నిర్మాణాల కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. పలువురు అక్రమ లే-అవుట్లో ఇళ్లు కొన్నారు. తరువాత అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు.
ప్రత్యేక ముఠా..
ఈ ప్రాంతంలో కొందరు మేస్త్రీలతో పాటు కొందరు స్థానిక ప్రతినిధులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. సర్వే నంబర్ 357 వంటి ప్రభుత్వ స్థలాలను ఎరగా చూపించి నకిలీ పట్టాలు సృష్టిస్తున్నారు. వెంటనే ఇళ్లు నిర్మించి లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్నారు. చివరకు ఆ ఇళ్లు అధికారంగా వచ్చినవి కాదని తెలుసుకొని కొనుగోలుదారులు అధికారుల చుట్టూ క్రమబద్ధీకరణ కోసం తిరుగుతున్నారు.
కంపెనీలు పెడతామని మరికొందరు... : మారేడుపూడిలో కంపెనీ పెడతామని ఇటీవల భూ దళారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ స్థలం ఇస్తే కంపెనీ నిర్మిస్తామని దర ఖాస్తు కూడా చేసుకున్నారు. చెరువు బందలో నిర్మించిన అక్రమ నిర్మాణాల గురించి రెవెన్యూ అధికారులను వివరణ అడిగితే ఆ నిర్మాణాలు మా హయాంలో కావని తప్పించుకోవడం గమనార్హం.
రూ. 100 కోట్ల పైమాటే.. : మారేడుపూడిలో 159 సర్వే నంబర్ల పరిధిలో 395.24 ఎకరాల కొండ, చెరువులు, బంధలు, వాగులు ఉన్నాయి. ఇప్పటికే వాగులు దాదాపు మాయమయ్యాయి. సర్వే నంబర్ 357లో 211.65 ఎకరాల కొండతో కూడిన భూమి ఉంది. ఇది కాకుండా వాగులు, చెరువులు, బందలు కలిసిపోయాయి. ఈ ప్రాంతంలో ప్రస్తుతం సెంటు భూమి లక్ష రూపాయిలు పలుకుతోంది. ఈ మేరకు నిటారుగా ఉన్న కొండ ప్రాంతాలను పక్కకు పెట్టినా మిగిలిన 200 ఎకరాలను కాపాడుకోకపోతే రూ. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు రక్షణ లేనట్లే. ప్రధానంగా సర్వే నంబర్ 357లో స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఎటువంటి పత్రాలు లేకుండా ఇళ్లు నిర్మించేందుకు పూనుకోవడంతో రెవెన్యూ యంత్రాంగం తొలగించింది. ఆ సమయంలో ఆ ప్రజాప్రతినిధి అధికారులతో వాగ్వాదానికి దిగి, ‘మారేడుపూడిలో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయి.. తొలగిస్తే అన్నీ తొలగించండి’ అని చెప్పడం ద్వారా అక్రమాలను అధికార పార్టీ నేతే అంగీకరించినట్లు స్పష్టమయింది.