కార్మికులు, పార్టీల నేతల అరెస్టు, విడుదల
మంత్రి పల్లెను నిలదీసిన కార్మికులు
పలు చోట్ల బస్సు అద్దాలు ధ్వంసం
కార్మికులకు అండగా వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం
అనంతపురం రూరల్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకూ ఉధృతం అవుతోంది. గురువారం రీజియన్ వ్యాప్తంగా కార్మికులు కదంతొక్కారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు.అనేకచోట్ల అరెస్టులు జరిగాయి. జిల్లాలోని అనంతపురం, కదిరి తదితర ప్రాంతాల్లో బస్సు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కార్మికులు డిపో ఆవరణలో ఉండకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం నేతలు మద్దతు తెలిపారు. నగరంలో ఈయూ, ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మిక నేతలు కొండయ్య, వీఎన్ రెడ్డి, భాస్కర్ నాయుడు, గోపాల్, రామాంజినేయులు, కార్మికులు మంత్రి పల్లె రఘునాథ రెడ్డిను నిలదీశారు. ఫిట్‌మెంట్, ప్రభుత్వంలో విలీనంపై స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ అడ్డుకున్నారు. మంత్రి కారు ఎదుట బైఠాయించారు.
పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్మికులను పక్కకు నెట్టారు. దీంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీపీఎం నేతలు సాయంత్రం సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేయబోతుండగా పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను అరెస్టు చేశారు. హిందూపురంలో హైర్ బస్సులను తిప్పేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. దీనిని నిరసిస్తూ కార్మికులు స్టేషన్ ఎదుట బైఠాయించారు.
ఉరవకొండలో కార్మికులకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మద్దతు తెలిపారు. కార్మికులపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తామనడం సరికాదన్నారు. ఇందుకు సీఎం మూల్యం చెల్లించకతప్పదన్నారు. కదిరిలో ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా కార్మికుల మద్దతు తెలిపారు. ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తోందని విమర్శించారు.
ఫిట్‌మెంట్ 43 శాతం ప్రకటించాల్సిందేనన్నారు. తాడిపత్రిలో పోలీసులకు కార్మికుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ప్రైవేట్ బస్సులను ఏవిధంగా పంపుతారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు 42 మందిని అదుపులోకి తీసుకుని, వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు. మడకశిర బస్టాండ్ ముందు కార్మికులు ధర్నా చేశారు. పుట్టపర్తిలో సమ్మె ప్రభావం కన్పించింది.
249 బస్సులు నడిపిన ఆర్టీసీ
రీజియన్ వ్యాప్తంగా పోలీసులు బందోబస్తు మధ్య ఆర్టీసీ 249 బస్ సర్వీసులను తిప్పింది. ఇందులో హైర్ బస్సులు 130,, 119 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. పోలీసులు బందోబస్తు మధ్య బస్సులు తిప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మంది వరకు డ్రైవర్లు, కండక్టర్లను నియమించారు. ప్రభుత్వ ఒత్తిడి వల్ల ప్రమాదమని తెలిసినా ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపాల్సి వస్తోందని ఓ అధికారి చెప్పారు.
ప్రయాణికులకు తప్పని తిప్పలు..
అరకొరగా బస్సులు తిప్పుడంతో ప్రయాణికులు బస్టాండ్‌లో గంటల తరబడి వేచి ఉన్నారు. కొందరు ప్రయాణికులు ప్రైవేట్ వ్యాన్లు, డీజిల్ ఆటోలను ఆశ్రయించారు. పరిమితికి మించి ప్రయాణికులతో ప్రైవేటు వాహనాలు, డీజిల్ ఆటోలు తిరిగాయి. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు రైల్వే స్టేషన్‌లో బారులు తీరారు.
సీఐటీయూ నేతల అరెస్టు
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీఐటీయూ నేతలు ఇంతియాజ్, నాగరాజు, గోపాల్ ఆర్టీసీ ఆవరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకొని నేతలను అరెస్టు చేశారు. పోలీసుల చర్యలను నాయకులు ఖండించారు.
ఎంసెట్ అభ్యర్థులు ఇబ్బంది రాకూడదు ఐవైఆర్ కృష్ణారావు
అభ్యర్థులు ఎంసెట్‌కు హాజరయ్యేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సూచించారు. ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో కలిసి గురువారం ఆయన కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎంసెట్ అభ్యర్థుల రవాణా సౌకర్యం వివరాలను వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం చేపట్టిన బస్సు సర్వీసుల వివరాలను వివరించారు.
విధులకు హాజరుకాకపోతే తొలగిస్తాం : ఆర్టీసీ ఆర్‌ఎం
రీజియన్‌లో సమ్మె కారణంగా కాంట్రాక్టు 71 డ్రైవర్లు, 14 కండక్టర్లు విధులకు హాజరుకాలేదు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదేశాల మేరకు వారు విధులకు హాజరుకాకపోతే తొలగిస్తామనిచ రెగ్యులర్ చేయబోమని ఆర్‌ఎం జీ వెంకటేశ్వర రావు ఓ ప్రకటనలో హెచ్చరించారు. వెంటనే కాంట్రాక్ట్ ఉదోయగులు విధులకు హాజరు కావాలని ఆదేశించారు.
ఆర్టీసీ సమ్మె ఉద్ధృతం
Published Fri, May 8 2015 4:25 AM | Last Updated on Wed, Aug 29 2018 7:39 PM
Advertisement
Advertisement