ఆత్మకూరు: అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఒకరు మృతి చెందారు. ఆత్మకూరు మండలంలోని పీఏబీఆర్ కెనాల్ వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో గుడుదప్ప (50) అనే కానిస్టేబుల్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
పీఏబీఆర్ కెనాల్ నుంచి రైతులు గండి కొట్టి నీటిని తరలిస్తున్నారని పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అనంతపురంకు చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గుడుదప్ప గత పది రోజుల నుంచి కెనాల్ వద్ద డ్యూటీ నిర్వహిస్తున్నాడు. బుధవారం గుడుదప్ప కాలువను పరిశీలించి అటు వైపుగా స్కూటీపై వెళ్తుండగా కళ్యాణదుర్గం నుంచి అనంతపురంకు వెళ్లే కడప ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. అతని తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మరణించాడు.
అనంతరం సంఘటనా స్థలానికి ఏఆర్ డీఎస్పీ అక్కడకు చేరుకొని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. బస్సు అతివేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.