ఇంట్లోకి దూసుకెళ్లి ఆగిన ఆర్టీసీ బస్సు
కృష్ణాజిల్లా, నూజివీడు : ట్రాక్టర్‌ను ఢీకొని అదుపుతప్పి ఆర్టీసీ బస్సు ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన నూజివీడు పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వివరాలిలా ఉన్నాయి. విజయవాడ గవర్నర్‌పేట–2 డిపోకు చెందిన సీఎన్‌జీ 308 సర్వీసు బస్సు విస్సన్నపేటలో 11.50కి విజయవాడ వెళ్లేందుకు బయలుదేరింది. నూజివీడులోని విస్సన్నపేట రోడ్డులో ఉన్న పంట కాల్వ సమీపంలోకి వచ్చేసరికి లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా అదే సమయంలో విస్సన్నపేట వెళ్లే ట్రాక్టర్ ఎదురైంది. దీంతో బస్సు డ్రైవర్ వీ మాధవరావు ట్రాక్టర్ ఇంజిన్‌ను తప్పించినప్పటికీ దాని ట్రక్కును బస్సు ఢీకొట్టి ఒక్కసారిగా అదుపుతప్పి వేగంగా ఎడమ వైపునకు వెళ్లి బోడబళ్ల నాగేశ్వరరావు ఇంటిని ఢీకొని ఆగింది. ట్రక్కును ఢీకొనడంతో దాని చింతకాయ (లింక్) తప్పుకుని ఇంజిన్ నుంచి ఊడిపోయి చొక్కాకుల వెంకటేశ్వరరావు ఇంటి వరాండాలోకి వెళ్లింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 21మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్‌కు మాత్రం చెయ్యి విరిగింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మార్గంలో పెద్ద ప్రమాదం జరిగి, ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బస్సు కుడివైపు భాగం బాగా దెబ్బతింది. స్థానికులు 108 కు ఫోన్ చేయడంతో అంబులెన్స్ వచ్చి బస్సు డ్రైవర్‌ను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించింది. రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఓవర్‌టేక్ చేయడానికి డ్రైవర్ ప్రయత్నించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ రెండు ఇళ్ల వరండాలలో ఎవరో ఒకరు కూర్చుని ఉండేవారని, ఈ రోజూ ఎవరూ లేరని, ఉండి ఉంటే వారి ప్రాణాలు గాలిలో కలిసి ఉండేవని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే సీఐ మేదర రామ్‌కుమార్, పట్టణ ఎస్‌ఐ రంజిత్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ స్తంభించకుండా చర్యలు తీసుకున్నారు. డ్రైవర్ వీ మాధవరావు, కండక్టర్ కన్నా శ్రీనివాసరావు నుంచే కాకుండా, స్థానికులు, ప్రయాణీకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment