
పిడుగుపల్లె వద్ద బోల్తాపడిన ఆర్టీసీ బస్సు
కాశినాయన : కలసపాడు మండలంలోని పిడుగుపల్లె ఎస్సీ కాలనీ వద్ద మలుపులో బుధవారం ఉదయం 6 గంటలకు ఆర్టీసీ బస్సు బోల్తాపడటంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా గిద్దలూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ29 జెడ్ 5393 నెంబరు గల ఆర్టీసీ బస్సును బ్రహ్మంగారిమఠం ఆరాధన మహోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా నడుపుతున్నారు. బస్సులో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. మలుపు వద్ద బస్సు అదుపు తప్పడంతో బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న కలసపాడు ఎస్‌ఐ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి. సింగిల్ డ్రైవరే రాత్రింబవళ్లు బస్సు నడుపుతుండటంతో ప్రమాదం జరిగిందని సమాచారం. ఆర్టీసీ వారు మరో బస్సును ఏర్పాటు చేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. ఈ విషయమై కలసపాడు ఎస్‌ఐ వెంకటరమణను వివరణ కోరగా డ్రైవర్ శ్రీనివాసులుపై కేసు నమోదు చేశామని తెలిపారు.