పట్టుబడిన మత్తుపదార్థాల బస్తాలు
జమ్మలమడుగు రూరల్: బెంగళూరు నుంచి జమ్మలమడుగుకు వస్తున్న ఆర్టీసీ బస్సులో గుర్తుతెలియని వ్యక్తులు గుట్కా రవాణా చేస్తున్న విషయం వెలుగు చూసింది. అర్బన్ సీఐ ప్రవీణ్‌కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు బెంగళూరు నుంచి కదిరి, పులివెందుల, వేంపల్లె, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మీదుగా తిరుగుతుంది. అయితే బుధవారం రాత్రి ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తులు బెంగళూరులో మూడు బస్తాల్లో గుట్కా, చైనీ ఖైనీ, తదితర మత్తు పదర్థాలను బస్సులో వేసుకొని బయలుదేరారు. మార్గమాధ్యంలో పులి వెందులకు రాగానే ఆర్టీసీ బస్సు తనిఖీ సిబ్బంది బస్సును ఆపి తనిఖీ చేశారు. సంబంధిత వ్యక్తులు బస్సులో నుంచి దిగి వెళ్లిపోయారు.
బస్సు తెల్లవారుజామున 6 గంటలకు జమ్మలమడుగు ఆర్టీసీ డిపోకు చేరుకొంది. దీంతో ప్రయాణికులందరూ తమ లగేజిని తీసుకోని వెళ్లిపోగా బస్సులో మూడు బస్తాలు మిగిలిపోయాయి. ఆర్టీసీ డ్రైవర్ డిపో అధికారులకు సమాచారం ఇచ్చి లగేజి రూంలో బస్తాలను దించివేశారు. అనుమానం వచ్చిన అధికారులు బస్తాలను తెరిచిచూడగా అందులో మత్తుకు సంబంధించిన గుట్కా, చైనీ తదితర ప్యాకెట్లు కనిపించాయి. వెంటనే అర్బన్ సీఐ కి డిపో అధికారులు సమాచారాన్ని చేరవేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని గుట్కా ప్యాకెట్లను స్టేషన్‌కు తరలించారు. వాటి విలువ దాదాపు లక్ష రూపాయలు ఉంటుందని సీఐ తెలిపారు. గుట్కా బస్తాలను కడప ఫుడ్ కంట్రోల్ అధికారులకు అందించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment