ఆదుకోకుంటే నిరవధిక సమ్మె
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకపోతే వచ్చే నెల 11 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నిర్ణయించింది. ప్రభు త్వ లోపభూయిష్ట విధానాలే ఆర్టీసీ నష్టాలకు కారణమని, సంస్థను ఆదుకోవాలనే డిమాం డ్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో సమ్మె చేస్తామని ఈయూ గౌరవాధ్యక్షుడు, ఎంఎల్‌సీ పి.జె.చంద్రశేఖరరావు, అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్‌లు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఈయూ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సంఘం ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్ విలేకరుల సమావేశంలో వివరించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న కారణంతో యాజమాన్యం కార్మికులకు చెందిన సీసీఎస్, ఎస్‌బీటీ, ఎస్‌ఆర్‌బీఎస్, పీఎఫ్ ట్రస్టుల డబ్బు వాడుకొందని తెలిపారు.
కార్మికులకు ఇవ్వాల్సిన రుణాలు ఇవ్వకపోతే ఈ నెల 2 నుంచి సమ్మె చేయడానికి సిద్ధపడ్డామని చెప్పారు. అయితే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రవాణా మంత్రులు ఆర్టీసీని ఆదుకుంటామని, 20 రోజుల్లో రూ.775 కోట్లు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె వాయిదా వేసినట్లు తెలిపారు. సంస్థ పరిరక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి, యాజమాన్యానికి ఈ నెల 2న సమ్మె నోటీసిచ్చినట్లు చెప్పారు. సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం, యాజమాన్యం ఎలాంటి చర్యలూ ప్రారంభించలేదని తెలిపారు. దీంతో సమ్మె నోటీసు కాలపరిమితి 41 రోజులు వచ్చే నెల 11కు పూర్తవుతున్నందున తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ సమ్మెను జయప్రదం చేసేందుకు వచ్చే నెల 1 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, వర్క్ షాపుల వద్ద సమ్మె సన్నాహక సభలు నిర్వహిస్తామని పద్మాకర్ తెలిపారు. ఆర్జీసీకి ప్రభుత్వ బకాయిలు తక్షణం చెల్లించాలని, ప్రొడక్షన్ యూని ట్లలో అవగాహన ఒప్పందం వెంటనే అమలుచేయాలని, పే స్కేల్, డీఏ వంటి డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నట్టు యూనియన్ రాష్ట్ర డెప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీరావు ‘సాక్షి’కి తెలిపారు.