సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సిబ్బందికి శుభవార్త. కరువు భత్యాన్ని 8% పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై నుంచి ఇది అమలులోకి రానున్న నేపథ్యంలో గడచిన 4 నెలలకు సంబంధించి బకాయిల రూపంలో ఒకేసారి చెల్లించనున్నారు. ప్రస్తుతం 47.8%గా ఉన్న కరువు భత్యం ఈ పెంపు తో 55.8%కు చేరుకోనుంది. రెగ్యులర్ సిబ్బందికి ఈ లబ్ధి అందనుంది. దీపావళి కానుకగా ఆర్టీసీ యాజ మాన్యం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇటీవల సీమాంధ్ర ఉద్యమానికి మద్దతుగా కార్మికులు జరిపిన సమ్మెను విరమించే సమయంలో మంత్రి బొత్స సమక్షంలో జరిగిన చర్చలో డీఏ పెంపుపై ఒప్పందం కుదిరిందని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్, ఎన్‌ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మహమూద్‌లు పేర్కొన్నారు.