అధికార పార్టీ అండ ఉంటే..
బొబ్బిలి రూరల్: నాయకుడి అండ ఉండి..మనోడు అని నాయకుడు భావిస్తే ఎలాంటి నిబంధనలూ వర్తించవు. ఈ క్రమంలోనే అవినీతి ఆరోపణలున్న ఉపాధిహామీ పథకం ఫీల్డు అసిస్టెంట్‌ను పునర్నియమించారు. మండలంలోని కోమటపల్లిలో వడ్డివెంకటరమణ అనే గ్రామీణఉపాధిహామీ పథకం ఫీల్డు అసిస్టెంట్ గతంలోఅనేక అవకతవకలకు పాల్పడ్డాడు. కోమటపల్లి-లింగంవలస పంచాయతీరాజ్ రోడ్డు పనుల్లో ఇతరుల పేరిట బిల్లులు స్వాహాచేశారనే ఆరోపణలతో 2014 మార్చి 4న విధుల్లో నుంచి తొల గించారు. టీడీపీ అధికారంలోకి రాగానే వెంకట రమణ తన ప్రయత్నాలను ప్రారంభించారు. చోటామోటా నాయకులను పట్టుకుని తన పని సాధించాడు. మళ్లీ తన ఉద్యోగం పొందాడు. ఈ ఏడాది ఆగస్టు 6న వెంకటరమణ రూ.7,500 అపరాధ రుసుము చెల్లించినందున ఆతనిని తిరిగి నియమిస్తున్నట్లు డ్వామా పీడీ గోవిందరాజులు నుంచి ఈనెల 10వతేదీన ఏపీఓ కె.కేశవరావుకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు సోమవారం నుంచి వెంకటరమణ విధుల్లో చేరారు.
ఒక్కొక్కరికి ఒక్కోరూలా?
సోషల్ ఆడిట్‌లో రూ.3,600 స్కాం రుజువైందని రంగరాయపురం ఫీల్డు అసిస్టెంట్ గేదెల శ్రీనివాసరావును ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలగించారు. నిజానికి సోషల్ ఆడిట్‌లో ఆరోపణలు వస్తే రికవరీ చేసి నిబంధనల మేరకు కొనసాగిస్తారు. అయితే శ్రీనివాసరావు సోదరుడు వైఎస్‌ఆర్‌సీపీలో ఉన్నందునే కక్షసాధింపుగా ప్రభుత్వం తొలగించిందని, కోమట పల్లి ఫీల్డు అసిస్టెంట్‌కు ఒక రూలు రంగరాయపురం ఫీల్డ్ అసిస్టెంట్‌కు మరో రూలా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.